క్యాన్సర్ కన్నా ప్రమాదకరం
దేశం మొత్తాన్ని సర్వ నాశనం చేస్తారు
ఉగ్రవాదులను ప్రధాని కార్యాలయానికి పిలిచి భోజనాలు పెట్టిస్తారు
మేం చేసిన అభివృద్ధిని తుడిచిపెట్టేస్తారు
ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు
న్యూఢిల్లీ, మే 22: ఇండియా కూటమికి క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైన జబ్బులు ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా దుయ్యబట్టారు. వీళ్లు కనుక విస్తరిస్తే దేశం మొత్తాన్ని సర్వనాశనం చేస్తారని మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలోని ద్వారకలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇండియా కూటమికి క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైన మూడు జబ్బులు ఉన్నాయి. వారు దారుణమైన మతతత్వ శక్తులు.. వారు దారుణమైన జాత్యహంకారులు.. వారు బంధుప్రీతి ఎక్కువగా ఉన్నవారు. ఈ మూడు జబ్బులు చాలా ప్రమాదకరం’ అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఇప్పుడు జైలు లో ఉన్న ఉగ్రవాదులను ప్రధానమంత్రి ఇంటికి పిలిపించి బిర్యానీలు తినిపిస్తారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
మీ ఇళ్ల తాళాలు లాక్కుంటారు
కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్రంగా దుయ్యబట్టారు. ఎన్డీయే హయాంలో చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రివర్స్ చేస్తారని ఆరోపించారు. ‘పేద ప్రజలకు మోదీ 4 కోట్ల ఇళ్లు ఇచ్చాను. వీటన్నింటినీ ఎస్పీ, కాంగ్రెస్ రివర్స్ చేయాలని నిర్ణయించుకున్నాయి మీ నాలుగు కోట్ల ఇళ్ల తాళాలను వాళ్లు లాక్కుంటారు. ఆ తాళం చేతులను వారి ఓటు బ్యాంకు వర్గాలకు ఇచ్చేస్తాయి. 50 కోట్ల మంది పేద ప్రజలకు జన్‌ధన్ ఖాతాలు తెరిపించాను. అందులో ఉన్న డబ్బంతా కాంగ్రెస్ వాళ్లు తీసుకుంటుంది. ప్రతి గ్రామానికి మోదీ ప్రభుత్వం విద్యుత్ తీసుకొచ్చింది. విద్యుత్ కనెక్షన్లను కట్ చేసి మీ జీవితాల్లో చీకటి తీసుకురావాలని కాంగ్రెస్ చూస్తోంది. ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించాను. వాళ్లు కనుక అధికారంలోకి వస్తే మీ ఇళ్లకు నీళ్లు రాకుండా చేస్తారు. ఇందులో వాళ్లు నిష్ణాతులు’ అని మోదీ అన్నారు.
ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లు
2010 నుంచి టీఎంసీ ప్రభుత్వం వాళ్ల ఓటు బ్యాంకు అయిన ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చిందని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘2010 తర్వాత ఇచ్చిన ఓబీసీ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లను ఇచ్చింది. కేవలం వారి ముస్లిం ఓటు బ్యాంకు కోసమే ఇచ్చింది. అందుకే ఇలా రద్దు చేసింది. వారి ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలకు అన్ని హద్దులు దాటిపోయాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటు బ్యాంకు రాజకీయాలు
ఓట్ల కోసం ప్రభుత్వ భూములను వక్ఫ్ బోర్డులకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ధారాదత్తం చేశాయని ఆరోపించారు. ‘గతంలో వీళ్లంతా (ఇండియా కూటమి పార్టీలు) ఓట్ల కోసం ఇచ్చేవారు. మైనారిటీలకు బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయిం చాలని చూశారు. బ్యాంకులు, ప్రభుత్వ టెండర్లను మతం ఆధారంగా కేటా యించాలని ప్రణాళికలు వేశారు. ఓటు బ్యాంకు కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించారు’ అని మోదీ దుయ్యబట్టారు. ‘అప్పుడప్పుడూ రాకు మారుడి నోటి నుంచి నిజాలు బయట కొస్తాయి. కాంగ్రెస్ రాకుమారుడు నిజాన్ని ఒప్పు కొన్నారు. ఆయన నానమ్మ, నాన్న, అమ్మ హయాంలో వాళ్లు దళితులు, వెనుకబడిన వర్గాల వారు, ఆదివాసీలకు వ్యతిరేకమని అంగీకరించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తరతరాలను కాంగ్రెస్ నాశనం చేసింది’ అని మోదీ మండిపడ్డారు.






