అగ్నివీర్‌కు మంగళం పాడుతాం
హర్యానా ఎన్నికల ప్రచారంలో రాహుల్ హామీ
రైతు రుణాలు మాఫీ చేస్తామని వెల్లడి
సైనికులను లేబర్లుగా మార్చారంటూ ఆగ్రహం
అదానీల చేతుల్లో పావుగా మారిన మోదీ ప్రభుత్వం
సోనిపట్, మే 22: కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సైనికుల నియామక ప్రక్రియలో అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని ఆర్మీ కార్యాలయంలో కాకుండా ప్రధానమంత్రి కార్యాలయం రూపొందించిందని ఆరోపించారు. బుధవారం హర్యానాలోని సోనిపట్ లో తొలి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. దేశంలోని సైనికులను ప్రధాని మోదీ ప్రభుత్వం లేబర్లుగా మార్చిందని దుయ్యబట్టారు. సైనిక అమరవీరులను మోదీ ప్రభుత్వం రెండు రకాలుగా విభజించిందని, ఒక వర్గానికి అమరవీరుల స్థాయి కల్పిస్తూ వారికి అన్నిరకాల వసతులు కల్పిస్తూ.. పెన్షన్ ఇస్తున్నారని, పేద కుటుంబాలకు చెందిన సైనికులకు మాత్రం ఇవేవీ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు.
ధనవంతుల చేతుల్లో పావు..
నరేంద్ర మోదీ ప్రభుత్వం తన విధానాలతో ఎప్పుడో ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకుందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. అదానీల వంటి ధనవంతుల చేతిలో పావుగా మారిందని విమర్శించారు. అదానీకి ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు గంపగుత్తగా అమ్మేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే మోదీలా 22 మంది ధనవంతులకే రుణమాఫీ చేసినట్టు కాకుం డా రైతులందరికీ రుణమాఫీ చేసి వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రైతుల పంటలకు ఎప్పటికప్పుడు కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పారు. రుణమాఫీకి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేసి, రైతులకు అవసరమైనప్పుడల్లా రుణమాఫీ చేస్తామని తెలిపారు.
ప్రతినెలా రూ.8,500
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేద కుటుంబాలకు ప్రతినెలా రూ.8500 బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తా మని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఇస్తున్న వేతనాన్ని రూ.400కు పెంచుతామని వివరించారు. అలాగే ఆశా వర్కర్లకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం పెంచుతామని వివరించారు. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఫస్ట్ జాబ్ హక్కును కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక, బీజేపీ చేతుల్లో నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడాలని ఓటర్లను రాహుల్‌గాంధీ విజ్ఞప్తి చేశారు.






