24-05-2025 01:04:53 AM
గంటల తరబడి గాల్లోనే భారత దౌత్య బృందం విమానం
మాస్కో: పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసింది. అందులో ఒక భారత ప్రతినిధి బృందానికి రష్యాలో ఊహించని అనుభవం ఎదురైంది. డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి నేతృత్వంలోని దౌత్యం బృందం రష్యాలో ల్యాండ్ అయ్యే సమయానికి మాస్కోలో డ్రోన్ దాడి జరిగింది. దీంతో మాస్కో ఎయిర్‌పోర్టును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ కారణంగా భారత దౌత్య బృందం విమానం గాల్లోనే చాలాసేపు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. కొంతకాలంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
రెండు దేశాల డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి కారణంగా మాస్కోలో దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు కొన్ని గంటల పాటు నిలిపేశారు. దీంతో భారత దౌత్య బృందం విమానం ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ అంతరాయం కారణంగా చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టిన భారత దౌత్య బృందం విమానం కొన్ని గంటల తర్వాత సురక్షితంగా మాస్కో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. సమాచారం అందుకున్న రష్యాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు అఖిలపక్ష ఎంపీల ప్రతినిధి బృందాన్ని స్వాగతించి అక్కడి నుంచి హోటల్‌కు తీసుకెళ్లారు.