calender_icon.png 24 May, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ సిందూర్‌ను ప్రపంచం కొనియాడింది

24-05-2025 01:02:03 AM

పాక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని ప్రపంచానికి చూపాం

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌ను ప్రపంచ దేశాలు కొనియాడాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) పదవీ పురస్కార కార్యక్రమంలో షా మాట్లాడారు. ‘ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి దీటైన జవాబు. హద్దులు దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించేందుకు భారత్ వారి స్థావరాలపై మన సైన్యం మెరుపు దాడులు చేసింది.

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాల వివరాలను బయటపెట్టడంతో పాటు పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందనే విషయాన్ని భారత్ మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. ఆపరేషన్‌లో భారత సైన్యం, బీఎస్‌ఎఫ్, ఇంటలిజెన్స్ ఏజెన్సీలు అద్భుతంగా పని చేశాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆపరేషన్ విజయవంతమైంది. పాక్ క్షిపణులను తిప్పికొట్టడంలో బీఎస్‌ఎఫ్ దళాలు ముఖ్యపాత్ర పోషించాయి. అనేక దశాబ్దాలుగా ఉగ్రవాద సమస్య ఉంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది.’ అని తెలిపారు. 1965 నుంచి నేటి వరకు దేశప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన 2000కు పైగా బోర్డర్ సెక్యూరిటీ జవాన్లకు దేశం తరఫున నివాళులు అర్పించారు.