15 July, 2026 | 3:23 AM

మోత మోగుతోంది!

25-04-2024 12:44 AM

ఏప్రిల్ 19 రాత్రి 9 గంటల ప్రాంతం.. అది లక్నోలోని ఎకాన క్రికెట్ స్టేడియం.. సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్.. 17వ ఓవర్ ఐదో బంతికి అలీ ఔటయ్యాడు..

దీంతో తరువాతి బ్యాటర్ మైదానంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. అంతే.. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఏదో ఉరుములు ఉరుముతున్నట్లు.. వరుసగా పిడుగులు పడుతున్నట్లు స్టేడియం మొత్తం మోత మోగిపోయింది. తదుపరి ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్ నుంచి మెట్లు దిగి మైదానంలోకి వచ్చేంత వరకు ఈ అరుపులు ఆగింది లేదు! ఆ సమయంలో అక్కడ నమోదైన ధ్వనికి స్టేడియం మొత్తం ఊగిపోయింది. 

రాయల్ ఇన్‌ఫీల్డ్ బండి పక్క నుంచి వెళ్లినట్లు.. 4 పిన్ డీజే తలాపున మోగినట్లు.. థౌజెండ్‌వాలా పటాసు పేలినట్లు.. మోతెక్కిపోయింది.

 అందుకు కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. అదేనండీ మైదానంలోకి తలా అడుగు పెడుతుంటే ఆ మాత్రం సౌండ్ ఉండదా! మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని భావిస్తున్న నేపథ్యంలో అతడు ఆడుతున్న మ్యాచ్‌లకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. వాంఖడేలో ముంబై, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిమానులు ఎంత గోల చేశారంటే.. సౌండ్ ప్రెజర్ లెవల్ మీటర్‌పై దాని తీవ్రత 130 డెసిబుల్స్‌గా నమోదైంది. వరుసగా పది నిమిషాలు ఇదే తీవ్రతతో శబ్దాలు వింటే.. కర్ణభేరి పగలడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పక్కరలేదనుకుంటా! చెన్నై చెపాక్‌లో ధోనీ బరిలోకి దిగితే చాలు సౌండ్ లెవల్ మీటర్‌పై కొత్త రికార్డులు నమోదవడం కొత్త కాకపోయినా.. లక్నోలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

మొత్తం ఎకాన స్టేడియం పసుపు రంగు పులుముకుంది. ఆడుతున్నది లక్నో సొంతగడ్డపైనా లేక చెన్నైలోనా అనే అనుమారం ఆటగాళ్లకు సైతం రాకమానదు. ఈ మ్యాచ్‌లో ధోనీ స్టేడియంలోకి అడుగుపెడుతున్న సమయంలో ప్రత్యర్థి జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్ భార్య ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ‘ఒక్క వ్యక్తి కోసం ఇంత ఆరాధన. ఇది అతి కొద్ది మందికే సాధ్యం. ఈ గోలలో 10 నిమిషాలు ఉంటే వినికిడి సమస్య రావడం ఖాయమని స్మార్ట్ వాచ్ కూడా చెబుతోంది. హ్యాట్సాఫ్ టు ధోనీ’ అని తన వాచ్ స్క్రీన్ షాట్‌తో పోస్ట్ పెట్టింది. ఇక మంగళవారం చెపాక్ స్టేడియంలో లక్నోతో పోరులో చివరి ఓవర్‌లో మైదానంలోకి వచ్చిన ధోనీ.. ఎదుర్కొన్న ఏకైక బంతిని బౌండ్రీకి తరలించాడు. మహీ స్టేడియంలోకి వస్తున్న సమయంలో.. లక్నో బ్యాటర్ నికోలస్ పూరన్‌తో పాటు మరికొంతమంది ప్లేయర్లు చెవులు మూసుకోవడం తాను గమనించినట్లు ఇయాన్ బిషప్ వెల్లడించాడు. బ్యాట్‌తో ఎన్నో రికార్డులు తిరగరాసిన ధోనీ ఇప్పుడు ఇలా కూడా నయా రికార్డులు లిఖిస్తుండటం గమనార్హం. 

సంక్షిప్త స్కోర్లు

ఢిల్లీ: 20 ఓవర్లలో 224/4 (పంత్ 88 నాటౌట్, అక్షర్ పటేల్ 66; సందీప్ 3/15), 

గుజరాత్: 20 ఓవర్లలో 220/8 (సుదర్శన్ 65, మిల్లర్ 55; రసిక్ 3/44, కుల్దీప్ 2/29).