ఇరుకు వంతెన.. ఇంకెన్నేళ్లు యాతన?
నిధులు మంజూరైన ప్రారంభం కాని పనులు
ఏండ్లు గడిచినా తీరని అవస్థలు.
ప్రమాదకరమని తెలిసినా ఆగని ప్రయాణాలు
నూతన బ్రిడ్జి నిర్మించాలని వాహనదారులు వేడుకోలు
గరిడేపల్లి, మార్చి 8 : తరాలు మారుతున్నా ఈ వంతెన తలరాత మాత్రం మారడం లేదు. జిల్లా రహదారిగా ఉన్నప్పటికీ ఈ మార్గంలో ప్రయాణం చేయడం వాహనదారులకు ప్రాణాపాయంగా మారిం ది. తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రాణనష్టం సంభవిస్తున్నా అధికారులు, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏండ్లు గడిచినా అవస్థ తీరలే.. :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటికీ గరిడేపల్లి - సూర్యపేట రహదారిలోని అష్టవంకరలు, ఇరుకైన వంతెన సమస్య మాత్రం మోక్షం కలగడం లేదు. మండలంలోని మర్రికుంట గ్రామం సమీపంలో సాగర్ ఎడమ కాలువ నిర్మాణ సమయంలో చిన్న చిన్న గ్రామాలను కలుపుతూ సుమారు 60 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన ఇప్పటికీ వాడుకలోనే ఉంది. కాలక్రమేణా రవాణా పెరిగినప్పటికీ పాక్షికంగా దెబ్బతిన్నా ఈ వంతెన మాత్రం విస్తరణకు నోచుకోలేదు. ఇరుకైన వంతెనపై భారీ వాహనాలు సైతం ప్రయాణించాల్సి రావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ఇరుకు వంతెన ఇంకెన్నేళ్ళు అంటూ వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనులు : నేరేడుచర్ల, హుజూర్ నగర్ ప్రాంతాలకు చెందిన వారు గరిడేపల్లి నుండి జిల్లా కేంద్రానికి రావాల్సిన వారు ఈ మార్గం గుండా వస్తుండడంతో వాహనాల తాకిడి పెరిగింది. మర్రికుంట గ్రామం వద్ద ఈ ఇరుకైన వంతెన వల్ల రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో జూన్ 7, 2022న నాటి నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు, నేటి రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్రికుంట గ్రామం చివరలో లేదా గ్రామస్థులకు ఇబ్బందులు కలుగకుండా యదాస్థలంలో కొత్త వంతెన నిర్మించాలని ఇంజనీర్ ఇన్ చీఫ్ కు లిఖితపూర్వకంగా తెలియజేశారు. దీంతో నాటి ప్రభుత్వం జూన్, 2023న రూ.163.70 లక్షలకు అగ్రిమెంట్ అమౌంట్ మంజూరి చేసింది.
అయితే వంతెన నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్ నిధులు సరిపోవు అనే ఉద్దేశ్యంతో పనులు మొదలు పెట్టినట్లు తెలిసింది. దీనికి తోడు గ్రామస్థులు గత సంవత్సరం గ్రామమును ఆనుకుని కాకుండా ప్రస్తుతం ఉన్నచోటే నూతన బ్రిడ్జి నిర్మించాలని సంబంధిత అధికారులకు విన్నవించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇవే కాకుండా ప్రస్తుతం ఉన్నట్లు కాకుండా గ్రామ సమీపం వరకు రోడ్డు పొడిగించి అక్కడ కాల్వపై బ్రిడ్జి నిర్మిస్తే గ్రామస్థులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, అలాగే తమ ఇండ్లకు సైతం ఇబ్బంది కలుగుతుంది కోర్టును సైతం ఆశ్రయించినట్లు తెలిసింది. మొత్తానికి కారణం ఏదైనా నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం నిధులు మంజూరు అయిన ఆగిపోయాయి.
ఇప్పటికైనా పనులు సాగేనా..? :
నిధులు మంజూరి అయిన నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిపై నుంచి వాహనదారులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. పెద్దగా ఉన్న రెండు వాహనాలు ఎదురుగా వస్తే పట్టనంత ఇరుకుగా ఈ వంతెన ఉండడంతో ఒకవైపు నుంచి వాహనాలు వస్తున్నప్పుడు రెండోవైపున అవి వెళ్లేంతవరకు నిలుపుకోవాల్సి వస్తుంది. ఈ ఇబ్బంది ఒకటి రెండు సంవత్సరాలుగా కాకుండా ఏండ్ల తరబడి ఎదుర్కోవలసి వస్తూనే ఉంది.
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు వాహనదారులు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకొని విడుదలైన నిధులు వెనుకకు మళ్ళి పోకముందే గ్రామస్తులందరినీ సమన్వయం చేసి ఎవరికి ఇబ్బందులు కలగకుండా నూతనంగా బ్రిడ్జి నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు. ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో నూతన బ్రిడ్జిని నిర్మించి ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
కాంట్రాక్టర్ సుముఖంగా లేడు
మర్రికుంట గ్రామం వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణానికి 2023లో నిధులు మంజూరయ్యాయి. అయితే ప్రస్తుతం కాంట్రాక్టర్ సుముఖంగా లేడు.ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిని తొలగించి అదే ప్రదేశంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలంటే దాదాపు మూడు నెలల పాటు రాకపోకలను పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. నాడు మంజూరైన నిధులు నేడు నిర్మాణవేయాలు పెరగడం, అగ్రిమెంట్ గడువు మీడియం తో అగ్రిమెంట్ను రద్దు చేసుకుంటూ కాంట్రాక్టర్ లేఖ ఇవ్వడం జరిగింది.ఇదే విషయం ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
- ప్రసన్న, ఏఈఈ, ఎన్‌ఎస్పీ




