3 August, 2026 | 3:22 AM

కాలం చెల్లి కాటికి వెడలితే..

03-08-2026 01:55 AM

పీఎస్‌జే ఫిలిమ్స్ కో బ్యానర్‌లో ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం ‘ఆలోచన‘. సీనియర్ నటులు జీవీ నారాయణరావు, ప్రసాద్‌బాబు, నరసింహరాజు, రాజన్‌హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు.

మంచి కథాబలం ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల ఈ మూవీ ఫస్ట్‌లుక్, టీజర్ విడుదలయ్యాయి. తాజాగా ఆలోచన ఈ సినిమా నుంచి ‘భజగోవిందం’ పాటను చిన్న జీయర్ స్వామి విడుదల చేశారు. వృద్ధాప్యంలో కూడా స్నేహితులు ప్రతిరోజు కలుస్తూ ఉంటే ఒంటరితనం ఎవరి దగ్గరికి రాదని.. స్నేహం విలువలు, వాటి అవసరాల గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రమే ‘ఆలోచన‘.

శంకరాచార్యులు రచించిన భక్తి కావ్యం ‘మోహ ముద్గర’ నుంచి సంస్కృత శ్లోకాలలోని తత్వం, వేదాంతం జీవన సారాన్ని తెలుగు భాషలో రచయిత ప్రతాప్ రాజుల పల్లి అనువదించారు. వియాన్ ఎస్‌ఏ స్వరకర్తగా వ్యవహరిస్తూ మంగ్లీతో కలిసి ఆలపించారు. ‘స్థాపకాయచ ధర్మస్య, సర్వధర్మ స్వరూపిణే, అవతారవరిష్ఠాయ, రామకృష్ణాయతే నమః’ అనే శ్లోకంతో ఆరంభమైన ఈ గీతం ‘భజగోవిందం భజగోవిందం.. గోవిందం భజ మూఢ మతే.. కాలం చెల్లి కాటికి వెడలితే.. కరణము లేవీ కాయవులే..’ అంటూ సాగుతోంది. ఈ చిత్రానికి కెమెరా: టీ సురేంద్రరెడ్డి, సంగీతం: వియాన్, పాటలు: ప్రతాప్ రాజులపల్లి, ఎడిటర్: ఆర్‌ఎల్ వర్మ; ఆర్ట్: గిరీశ్ దేవాంగ్.