తెలంగాణ సంస్కృతిపై సినిమాలు రావాలి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా ఆయన్ను నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా దిల్ రాజు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన మొదట తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారుల సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘టీఎఫ్‌డీసీకి పూర్వవైభవం తీసుకురావాలి. అందుకు అందరి సహకారం అవసరం. తెలంగాణ సంస్కృతిని ఆధారంగా చేసుకొని సినిమాలు వచ్చేలా చూడాలి. మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా మరెంతో అభివృద్ధి చెందాలి.
టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా నాపై ఎంతో బాధ్యత ఉంది. ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పనిచేస్తా. పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తా’ అని దిల్ రాజు అన్నారు. దిల్ రాజు పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అధికారులు అభినందనలు తెలుపుతున్నారు.






