14 May, 2026 | 3:58 AM

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుదాం

14-05-2026 01:54 AM

సర్పంచుల అవగాహన సదస్సులో ఎంపీడీవో జస్వంత్ కుమార్, ఎంఈఓ రాయల వీరస్వామి

కూసుమంచి, మే 13(విజయక్రాంతి): ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూల్లో భాగంగా ఈనెల 11 నుండి 17 వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలలో మూడవ రోజు బుధవారం కూసుమంచి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూసుమంచి మండల స్థాయి సర్పంచుల అవగాహన సదస్సును మండల విద్యాశాఖ అధికారి   రాయల వీరస్వామి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీవో జస్వంత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను కల్పిస్తుందని   గ్రామ సర్పంచులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో ముందుకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం అయ్యేలా సమన్వయం తో కృషి చేయాలని  కోరారు.  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా   విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా  అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా కూసుమంచి మండల విద్యాశాఖ అధికారి రాయల వీరస్వామి మాట్లాడుతూ   గత విద్యా సంవత్సరం 11 పాఠశాలలో విద్యార్థుల నమోదు పెరిగిందని.. ఈ సంవత్సరం కూడా విద్యార్థుల నమోదు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.  ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులు వినియోగించుకుని  విద్యార్థులను  కార్పొరేట్ ,ప్రైవేటు పాఠశాలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోకే పంపాలనివిజ్ఞప్తి చేశారు.

సర్పంచుల అవగాహన సదస్సులో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు విద్యార్థుల పెంపు తదితర అంశాలపై  వివరించారు. ఈ  సంవత్సరం ప్రారంభమయ్యే బ్రేక్ ఫాస్ట్ గురించి అవగాహన కల్పించారు .రేపటినుండి ప్రారంభం కాబోయే బడిబాటకార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా గ్రామ సర్పంచులు కూడా కృషి చేయాలని పేర్కొన్నారు.

అవగాహన సదస్సులో కూసుమంచి సర్పంచి కొండా కృష్ణవేణి తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యం  కల్పించడం స్కావెంజర్స్ ను నియమించడం   లక్షలాది రూపాయల విద్యారంగానికి కేటాయించటం హర్షించదగిన పరిణామం అని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ వంతుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు , మల్లేపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు భూలక్ష్మి,  సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.