calender_icon.png 19 February, 2026 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదావహం!

18-02-2026 12:00:00 AM

శబరిమల ఆలయం సహా దేశంలోని మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై 9 మంది న్యాయ మూర్తులతో కూడిన ధర్మాసనం తుది విచారణను ప్రారంభించనుందని సుప్రీంకోర్టు పేర్కొనడం ముదావహం. ఈ విచారణ ఏప్రిల్ 7న ప్రారంభమై అదే నెల 22న ముగుస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తుల జోయ్ మాల్య బాగ్చీ, విపుల్ పంచోలీల ధర్మాసనం పేర్కొంది.

ముఖ్యంగా 2018 శబరిమల తీర్పు అనంతరం మత స్వేచ్ఛ పరిధి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26ల అమలు, మత సముదాయాల హక్కులు వంటి అంశాలను 9 మందితో కూడిన బెంచ్ క్షుణ్ణంగా పరిశీలించనుంది. మత సముదాయానికి చెందని వ్యక్తి ఆ ఆచారాన్ని పిల్ ద్వారా సవాల్ చేయగలడా? అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోనుంది. శబరిమల కేసుతో పాటు ముస్లిం మహిళలు మసీదులు, దర్గాల్లో ప్రవేశంపై, పార్శీ మహిళలకు అగ్ని దేవాలయల్లోకి ప్రవేశంపై నిషేధం, దావూదీ బోహ్రా సామాజిక వర్గంలో మహిళల్లో అంగవిచ్ఛిత్తి ఆచారం వంటి అంశాలు చర్చకు రానున్నాయి.

2018 నాటి సుప్రీం తీర్పును వ్యతిరేకించే వాదనలను ఏప్రిల్ 7 నుంచి 9 వరకు, తీర్పును సమర్థించే పక్షాల వాదనలను ఏప్రిల్ 14 నుంచి 16 దాకా ధర్మాసనం ఆలకించనుంది. కేసు నేపథ్యంలోకి వెళ్తే మొదట 2018లో శబరిమల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది. శబరిమలలో 10 నుంచి -50 ఏళ్ల వయసు ఉన్న మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ 4:1 మెజార్టీతో ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చింది.

ప్రార్థన స్థలాల్లో మహిళల పట్ల ఉన్న వివక్షను అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని 2019లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం నిర్ణయించింది. దీనిలో మసీదులు, దర్గాల్లో మహిళలకు ప్రవేశం, పార్శీ మహిళల సమస్యలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమస్యలపై విస్తృత ధర్మాసనాలు ఏర్పాటు చేసే అధికారం ఉందంటూ 2020లో మరో ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పులతో కేరళ సహా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.

సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏకంగా 67 పిటిషన్లు దాఖలయ్యాయి. కరోనా కారణంగా అప్పట్లో విస్తృత ధర్మాసనం ఏర్పాటు కాలేదు. తాజాగా 9 మందితో బెంచ్‌ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొంది. దీంతో ఈ కేసు మరోసారి ప్రాధాన్యతను సంతరించుకుంది. మతపరమైన విశ్వాసాలు ఒకవైపు, రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు మరోవైపు, ఈ రెండింటి మధ్య ఉన్న సున్నితమైన సరిహద్దును న్యాయమూర్తుల బెంచ్ ఎలా నిర్వచిస్తుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది.

అంతేకాదు తాజా విచారణతో దేశంలో ‘మహిళలకు హక్కులు’ అనే చర్చ మళ్లీ వేడెక్కే అవకాశముంది. ఒకవైపు మతస్వేచ్ఛను కాపాడాలని భావించే వర్గాలు, మరోవైపు సమానత్వాన్ని రాజ్యాంగ హామీగా చూడాలని కోరుకునే వర్గాలు విచారణ సందర్భంగా వాదనలు బలంగా వినిపించే అవకాశాలున్నాయి.

దాదాపు ఐదేళ్ల తర్వాత పునఃప్రారంభమవుతున్న ఈ ప్రక్రియ దేశ న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో 9 మందితో కూడిన న్యాయమూర్తుల బెంచ్ వెలువరించే తీర్పు.. కేవలం శబరిమలకే కాదు, దేశంలోని అన్ని మతపరమైన ప్రదేశాల్లో మహిళల హక్కుల భవిష్యత్తును నిర్ణయించేందుకు కేంద్రంగా నిలవనుంది.