calender_icon.png 19 February, 2026 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీనజన బాంధవుడు!

18-02-2026 12:00:00 AM

నేడు భాగ్యరెడ్డి వర్మ వర్ధంతి :

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచనలన్నీ ఇప్పుడు వివిధ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. అంబేద్కర్‌ను భిన్న పార్శాల్లో దర్శించడానికి ఆయన రచనలు దారి చూపిస్తున్నాయి. అయితే అంబేద్కర్ కన్నా ముందే దేశవ్యాప్తంగా ‘ఆది హిందువు’, నిమ్నజాతుల నాయకుడిగా గుర్తింపు పొందారు భాగ్యరెడ్డి వర్మ. గాంధీ, అంబేద్కర్‌ల కంటే ముందే అస్పృశ్యత నివారణ, అణగారిన వర్గాల హక్కులకై గళమెత్తిన గొంతుక .

దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన భాగ్యరెడ్డి వర్మ విద్యాప్రదాత, దీనజన బాంధవుడిగా పేరు పొందారు. భాగ్యరెడ్డి వర్మ 1888 మే 22న దళిత కులంలో జన్మించారు. భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు మాదరి వేంకట భాగయ్య. అయితే దళితులు ఈ దేశ మూలవాసులని, వారే మొదటి పాలకుడు అనే అర్థాన్ని సూచించేందుకే కుల గురువులు భాగయ్యకు రెడ్డి పదాన్ని చేర్చి ‘భాగ్యరెడ్డిగా మార్చారు. హిందూ సమాజానికి భాగ్యరెడ్డి చేసిన సేవకు ఆర్య సమా జం ఆయనకు ‘వర్మ’ అనే బిరుదును ప్రదానం చేసింది.

కులం కారణంగా తన జాతిజనులు సామాజిక వివక్షతకు గురవ్వడం బాధ కలిగించింది. తాము అంటరానివాళ్లం కాదని.. దేశమూలవాసులైన ఆదిహిందువులమని పేర్కొన్నారు. దళితుల దుస్థితికి విద్య లేకపోవడం, ఉదాసీనత కారణమని గ్రహించారు. జాతి జనుల్లో చైతన్యం తీసుకువచ్చి వారిలో సామాజిక వికాసం కలిగించడానికి, సామాజిక సంస్కరణోద్యమాలు మొదలుపెట్టారు. ‘దక్కన్ హుమ్యనిటేరియన్ లీగ్’ అనే సంస్థ స్థాపించి జీవహింస చేయరాదని ప్రచారం చేశారు. జంతుబలిని నిషేధించాలని నిజాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఆయన ఆది హిందువుల విద్యావికాసానికై, ముఖ్యంగా బాలికల విద్య కోసం పాఠశాలలను ప్రారంభించారు. నిమ్న వర్గాల కోసం హైదరాబాద్‌లో 26 పాఠశాలలు స్థాపించి వందల మంది పిల్లలకు విద్య అందించారు. అయితే ఆ పాఠశాలల స్వాధీనం కోసం నిజాం ప్రభుత్వం ముందుకు రాగా వాటిని తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తామంటేనే అప్పగిస్తానని షరతు పెట్టడం, దానికి నిజాం ప్రభుత్వం ఒప్పుకోవడం ఆయన విజయంగా చెప్పవచ్చు. భాగ్యరెడ్డి తన కృషి, పట్టుదల, చిత్తశుద్ధి, నీతి నిజాయితీలతో తన సేవా కార్యక్రమాల ద్వారా అటు ఆది హిందువుల్లో, ఇటు ప్రభుత్వంలో అభిమానాన్ని చూరగొన్నారు.

జగన్‌మిత్ర మండలిని మన్య సంఘంగా మార్చి సంఘం ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, దేవదాసి, జోగిని, ముర్లీ వంటి సాంఘిక దురాచారాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమించి చైతన్యం తీసుకువచ్చారు.  విజయ వాడలో జరిగిన మొదటి ఆంధ్ర పంచమ మహాసభకు అధ్యక్షుడిగా హాజరైన భాగ్యరెడ్డి వర్మ దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే పంచమ శబ్దం తొలగించి దాని స్థానంలో ఆది ఆంధ్ర పదం చేర్చి ‘ఆది హిందూ’ లేదా ‘ఆది మహాసభ’గా సంబోధించాలని కోరారు.

కాలక్రమంలో మన్య సంఘం స్థానంలో ‘ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్’ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను విస్తరించారు. హిందూ సమాజ పరిరక్షణకై చరమాంకం వరకు పోరాటం కొనసాగించిన భాగ్యరెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న క్షయ వ్యాధితో మరణించారు. భాగ్యరెడ్డి వర్మ రచనలు, ఉపన్యాసాలు, సంపాదకీయాలు, సృజనా త్మక రచనలు ఇంతవరకూ పుస్తక రూపంలో రాలేదు. వాటి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. దీంతో భాగ్యరెడ్డి వర్మ చేసిన రచనలను, ఆయన గొప్పతనాన్ని జాతికి చాటి చెప్పాల్సిన అవసరముంది.