18-02-2026 12:00:00 AM
పాలకుర్తి రామమూర్తి :
ప్రదేష్టార: త్రయయ: అమాత్యాః కంటక శోధనం కుర్యుః
- (కౌటిలీయం-4--1)
అమాత్యుల స్థాయిగల ముగ్గురేసి ప్రదేష్టలు కంటక శోధనం చేయా లి అంటాడు, ఆచార్య చాణక్య. ప్రదేష్టలు అంటే కంటక శోధనాధికారులు. కంటక శోధన అంటే.. ముళ్ళు తొలగించడం లేదా సంఘ విద్రోహులను ఏరివేయడం. సాధారణంగా రాజకీయం కలుషితమైంది. నేతలు స్వార్థపరులయ్యారు. వ్యాపార సంస్థలు లాభాలకై తప్పుడు మార్గాలను అన్వేషిస్తున్నారు. వైద్యులు అవసరం లేని వైద్యం చే స్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
ఇలా ప్రతిరోజు ఎన్నో వింటుంటాము. నైతిక విలువలు కళాశాల బోధనలకే పరిమితమౌతున్నాయనే ప్రచారం ఉన్నది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా.. వ్యక్తుల, పాలకుల ప్రమత్తతయే వారలా మారడానికి కార ణమౌతుంది. అసమర్ధుల చేతిలో అధికారం సంక్షోభాలకు కారణమౌతుంది. నిజానికి స్వఛ్ఛమైన నీటిని విషంతో కలుషితం చేసినట్లుగా కొత్తగా ఆయా రంగాల్లో ఉత్సాహంగా ప్రవేశించిన యువత ఆలోచనలను కలుషితం చేయడం సమంజసం కాదు.
సంఘవిద్రోహ చర్యలు..
రాజు లేదా నాయకుడు ప్రజలకు మంచి పాలనను అందించాలి. సంపదతోనే సుపరిపాలన సాధ్యపడుతుంది. ఫలవంతమైన ఆర్థిక కార్యకలాపాలే సంపదకు మూలం. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా లేకపోతే వర్తమా నం, భవిష్యత్తూ రెండూ నాశనమయ్యే ప్రమాదం ఉన్నది. అందుకే రాజ్యపాలనలో సంపదను సృష్టించడం గమ్యం కాగా రాజకీయ అధికారం పరిపాలనకు మార్గం. గ మ్యం మార్గాన్ని నిర్దేశిస్తుంది. రాజకీయ లక్ష్యాలు నెరవేరితేనే ఆర్థిక లక్ష్యాలు సాధించగలుగుతాము.
మంచిపాలన నిలకడతో కలిస్తే ఉత్తమ ఫలితాలు ఆవిష్కృతమౌతాయి. దానికి సమర్ధులైన అధికారులను నియమించాలి. కీలకమైన బాధ్యతలు అప్పగించే సమయంలో అధికారుల శక్తిసామర్ధ్యా లను వివిధ కోణాల్లో పరిశీలించాలి. బాధ్యతలను అప్పగించాక కూడా అడుగడుగునా వారి సామర్థ్యాన్నీ, నిజాయితీని పరీక్షించాలి. నాయకుడు, ఉన్నతాధికారులు నిజా యితీ పరులైతే సరిపోదు. కార్యనిర్వహణ చేసే కిందిస్థాయి అధికారులు కూడా నిజాయితీగా ఉండాలి.
ఒక అధికారి నిజాయితీప రుడో కాదో తెలుసుకోవడం కష్టం . అందుకే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచిస్తారాయన. మంచి పాలనను అందించేందు కు అవినీతిపరులైన అధికారులు ఏ స్థాయి లో ఉన్నా వారిని శిక్షించాలంటారాయన. ప్రజలు లేదా అధికారులు ఎక్కడైనా సంఘవిద్రోహ చర్యలకు పాల్పడినట్లు తన దృష్టికి వస్తే.. వారి చెడు నడతను సరిచేయడానికి చాణక్య వివిధ మార్గాలను సూచించాడు.
నరదుర్గమే శ్రేష్ఠం..
దుర్గాలన్నింటిలో నరదుర్గమే శ్రేష్ఠమంటారు. నరదుర్గం అంటే ప్రజలు. పాలకులు వారినందరినీ సమంగా చూడాలి. ఎవరినీ ఎక్కువగా నమ్మకూడదు. అలాగని నమ్మకుండా ఉండకూడదు. ఎక్కువగా నమ్మడం మృత్యువుతో సమానం, నమ్మకపోవడం అకాల మృత్యువుతో సమానం అంటుంది భారతం. ముఖ్యంగా అవినీతిపరులను గమనించడం, వారిని సకాలంలో ఏరివేయడం అవసరం. వారిని ఏరివేయడం, శిక్షించడాని కి అమాత్య స్థాయి కలిగిన అధికారులను నియమించాలి అంటున్నాడు చాణక్య. నేరం చేసిన వారికన్నా నేరానికి ప్రేరేపించిన వారికి రెండింతల శిక్షను వేయాలంటాడు.
మహాభారతంలో శాంతిపర్వంలో భీష్ము డు ధర్మరాజుతో.. రాజుకు జాగ్రత్త చాలా అవసరం. లోలోపల నిప్పు రగిలి పొగబారుతున్నట్లు దుర్మార్గులు రాజు దోషాలను గూర్చి ఆలోచిస్తుంటారు. అవకాశం రాగానే తమ బలాన్ని చూపి భయపెడతారు. అలాంటి దుర్మార్గులైన వారిని ఏ విధంగానైనా నాశనం చేయడం మంచిదంటూ ఉదా హరణగా కాలకవృక్షీయుని వృత్తాంతం చెపుతాడు.
అరణ్యంలో తపస్సు..
కాలకవృక్షీయుడనే ముని ఒకనాడు క్షేమదర్శి అనే రాజు వద్దకు వస్తాడు. వచ్చేప్పుడే రాజ్య పరిస్థితులు, అధికారుల తీరుతెన్నులు పరిశీలిస్తూ వచ్చిన ముని రాజును దర్శించి, నీకు ధనార్జన పట్ల ఏమరుపాటు ఉన్నది. అందువల్ల అనేకమైన ఆపదలు వచ్చే అవకాశం ఉన్నది. అంతేకాదు, నీ ఉద్యోగుల్లో చాలా మంది నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. కొందరు అధికారులు దొ ంగతనాలు చేసి తప్పించుకున్నారు అంటాడు.
తదుపరి తన చేతిలోని పంజరంలో ఉన్న పక్షిని సభలో అందరికీ చూపుతూ.. రాజా! ఇది త్రికాలవేది. అలాంటి వారి వివరాలు ఈ పక్షి నీకు చెపుతుంది. దీనిని పూజా గృహంలో ఉంచి ఉదయమే నీవు స్నానానంతరం దర్శించు. అందరి వివరాలు చెపు తుంది. దుర్మార్గులను పట్టిస్తుంది అంటూ పక్షి పంజరాన్ని క్షేమదర్శికి ఇచ్చి విడిదికి వెళ్ళిపోతాడు. ఆ రాత్రికి రాత్రే కొందరు రాజాధికారులు ఆ పక్షిని ఉపాయంతో సం హరిస్తారు.
ఉదయమే పక్షి మరణించిన వృత్తాంతాన్ని తెలుసుకున్న క్షేమదర్శి, కాలకవృక్షీయుని ఏకాంత మందిరానికి పిలిపిం చి జరిగిన వృత్తాంతాన్ని వివరిస్తాడు. అప్పు డు కాలకవృక్షీయుడు.. రాజా! నేను మీ నాన్నగారి మిత్రుడను. ఆయన మరణించాక దుర్మార్గులతో నిండిన ఈ దేశంలో జీవించలేక అరణ్యంలో తపస్సుకై వెళ్లాను. నీ మీది వాత్సల్యంతో నిన్ను దర్శించే ముందే ఈ రాజ్య పరిస్థితులు అవగాహన చేసుకున్నాను.
పక్షి నాటకం..
ఈ పక్షికి ఎలాంటి శక్తులూ లేవు. నీ చు ట్టూ ఉన్న వ్యక్తుల నిజ స్వరూపాన్ని నీకు ప్రత్యక్షంగా చూపి నీ కన్నులు తెరిపించడానికే ఉపాయంతో పక్షి నాటకం ఆడాను. పక్షిని చంపడంతో దుర్మార్గుల నైజం నీకు అవగతమైనది. జాగ్రత్తగా పరిశీలించు.. మొత్తంగా అవగాహన కుదురుతుంది. ప్రస్తుతానికి నన్ను బహిరంగంగా వెళ్లగొట్టి రహస్యంగా విచారణ జరిపించు. నేర్పుతో రాజాధికారుల్లో భేదాభిప్రాయాలను సృ ష్టించి.. వారి సంతోషాన్ని భంగపరచి ఒక్కొక్కరిని శిక్షించు, అంటూ బోధిస్తాడు.
ఆ వ్యూ హాన్ని పటిష్టంగా అమలు చేసిన క్షేమదర్శి దుర్మార్గులైన అధికారులను శిక్షించి, కాలకవృక్షీయుని పిలిపించి మంత్రిగా చేసుకొని రాజ్యాన్ని చక్కగా పాలించాడు. నిజానికి ఆవేశపరులైన యువకులను దగ్గరికి తీసి మతపరమైన లేదా రాజకీయపరమైన సం క్షోభాలను సృష్టించడం, రాజ్యాలను అతలాకుతలం చేయడం లక్ష్యంగా కొన్ని శక్తులు పనిచేస్తుంటాయి.
అలాంటి శక్తుల కార్యకలాపాలను ముందుగానే అంచనా వేయడం, గుర్తించడం లక్ష్యంగా గూఢచారి సంస్థలను పటిష్టపరచాలి. వారిని సమూలంగా నిర్మూలించే వరకు రహస్యంగా పనిచేయాలి. ఇ లాంటి శక్తులు కార్పొరేట్ రంగంలోనూ ఉం టాయి. వారి పట్ల సంస్థల నాయకత్వం అప్రమత్తంగా ఉండాలి. అలాగే వ్యక్తులు వ్యక్తిగ తంగా కూడా అలాంటి వ్యక్తుల మోసాలకు గురికావచ్చు. ముఖ్యంగా సైబర్ నేరాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.