పేరుకే మండల కేంద్రం.. తపాలా సేవలకు మాత్రం తిప్పలే..!
ఉన్నతాధికారులు స్పందించేదెప్పుడు..?
ముదిగొండ ,sep15(విజయక్రాంతి): పాలనా సౌలభ్యం కోసం ముదిగొండను మండల కేంద్రంగా మార్చి ఏళ్లు గడుస్తున్నా, ఇక్కడి తపాలా శాఖ (India Post)పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా మారింది. కనీసం ఒక సొంత భవనం గానీ,సరైన అద్దె ఇల్లు గానీ లేక ముదిగొండ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ (B.O)ఒక చిన్న ఇంటి వరండాలో కాలం వెళ్లదీస్తోంది.ఆ వరండాలో ఒక కుర్చీ, ఒక చిన్న టేబుల్ వేసి నడుపుతున్నారంటే ఇక్కడి దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.సమయానికి తీయరు..సేవలూ దొరకవు!మండల కేంద్రంలోని ఈ పోస్ట్ ఆఫీస్ ఎప్పుడు తీస్తారో, ఎప్పుడు మూస్తారో తెలియని పరిస్థితి నెలకొందని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసర పనుల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. కనీసం కూర్చోవడానికి స్థలం లేక, ఎండకు ఎండుతూ, వానకు నానుతూ వరండా బయటే నిలబడాల్సి వస్తోందని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గోకినేపల్లి చుట్టూ ప్రదక్షిణలు.. వ్యాపారుల గోస!ముదిగొండ మండల కేంద్రం అయినప్పటికీ, ఇక్కడి ప్రధాన తపాలా సేవలన్నీ పక్కనే ఉన్న గోకినేపల్లి సబ్ పోస్ట్ ఆఫీస్ (S.O) పరిధిలోనే సాగుతున్నాయి.ముదిగొండ రోజురోజుకూ పెద్ద వ్యాపార కేంద్రంగా ఎదుగుతున్నా, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అత్యవసర తపాలా సేవల కోసం తీవ్ర ఆలస్యం జరుగుతోంది.
ముదిగొండకు 'మెయిన్ ఆఫీస్' రావాల్సిందే!రెవెన్యూ మండలంగా మారిన ముదిగొండకు పూర్తి స్థాయి సబ్ పోస్ట్ ఆఫీస్ (S.O) మంజూరు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ అధికారులు పాత రికార్డులను పట్టుకుని, పక్క ఊరి సబ్ ఆఫీస్ కింద ముదిగొండను నడపడం ఇక్కడి ప్రజలను అవమానించడమే. ఇప్పటికైనా భారత తపాలా శాఖ ఉన్నతాధికారులు నిద్ర మత్తు వీడి, తక్షణమే స్పందించాలి. ముదిగొండ బ్రాంచ్ ఆఫీస్‌ను పూర్తి స్థాయి "సబ్ పోస్ట్ ఆఫీస్" గా అప్‌గ్రేడ్ చేసి, ఒక మంచి భవనంలోకి మార్చాలని, ముదిగొండకు మెయిన్ ఆఫీస్ హోదా కల్పించాలని మండల ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.