calender_icon.png 17 February, 2026 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రామా మధ్య మున్సిపల్ ఎన్నిక..

17-02-2026 12:00:00 AM

చైర్మన్‌గా పత్యా నాయక్, వైస్ చైర్మన్‌గా గీత ప్రమాణం

ఆమనగల్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): ఆందోళనలు, అనూహ్య రాజకీయ మలుపుల మధ్య ఆమనగల్ మున్సిపల్ పీఠంపై కొత్త పాలకవర్గం ఎన్నిక పూర్తయింది. గంటగంటకూ మారిన సమీకరణాల నేపథ్యంలో, మున్సిపల్ చైర్మన్గా పత్యా నాయక్, వైస్ చైర్పర్సన్గా తల్లోజు గీత ఎన్నికయ్యారు. అయితే, ఈ ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం హైడ్రామాను తలపించింది. అమన గల్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్  ఎన్నిక పై అందరి లో సస్పెన్షన్ నెలకొంది. 

ట్విస్ట్ ఇచ్చిన పత్యా నాయక్.. 

ఎన్నికలకు ముందు మూడు ప్రధాన పార్టీలు తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు రహస్య క్యాంపులు నిర్వహించిన ప్పటికీ, అసలు ట్విస్ట్ బీఆర్‌ఎస్ క్యాంప్లో చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన పత్యా నాయక్ అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లతో చేతులు కలపడం స్థానిక రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. తొలుత అనిత రెడ్డి పేరు చైర్మన్ రేసులో వినిపించినప్పటికీ, చివరి నిమిషంలో పత్యా నాయక్ తెరపైకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 15 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.

పత్యా నాయక్ వర్గానికి బీజేపీ (6), కాంగ్రెస్ (2) కౌన్సిలర్లతో పాటు, స్వయంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తన ఎక్స్ అఫీషియో ఓటును వేయడంతో వీరి బలం 9కి చేరింది. ప్రతిపక్షం బీఆర్‌ఎస్ అభ్యర్థి రామకృష్ణకు 7ఓట్లు మాత్రమే రావడంతో, మెజారిటీ ప్రాతిపదికన పత్యా నాయక్ వర్గాన్ని విజేతలుగా ప్రకటించారు.

నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి తన ఎక్స్ అఫీషియో ఓటును గద్వాలలో ఉపయోగించుకోవాలని నిర్ణయించుకోవడం ఆమనగల్ లెక్కలను గణనీయంగా ప్రభావితం చేసింది. 

రణరంగంగా మున్సిపల్ కార్యాలయం

పత్యా నాయక్ పార్టీ మారడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం వెలుపల భారీ ఎత్తున నిరసన చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఆర్‌ఎస్పీ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ ఎన్నికలు ఇంచార్జ్ రజిని,ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు బైఠాయించి నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యగా కొత్త చైర్మన్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అభివృద్ధే మా లక్ష్యం: ఎమ్మెల్యే 

ఎన్నిక అనంతరం  మాట్లాడుతూ.. ఆమనగల్ పట్టణ అభివృద్ధిని కాంక్షించే కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీలకతీతంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు.