3 April, 2026 | 2:42 AM

మున్సిపల్ ‘బాదుడు’.. మౌలిక ‘కరువు’!

03-04-2026 01:00 AM
  1. చేవెళ్ల ఆబాది వీధుల విస్తరణపై పాలకుల నిర్లక్ష్యం 
  2. పెరిగిన పన్నుల భారం.. మారని బతుకు చిత్రం

చేవెళ్ల, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం సమకూర్చే నియోజకవర్గాల్లో ఒకటిగా పేరున్న చేవెళ్ల, మున్సిపాలిటీగా రూపాంతరం చెందినా ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల వసూళ్లలో జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచిన చేవెళ్ల మున్సిపాలిటీ, అభివృద్ధిలో మాత్రం వెనుకబడే ఉంది. పన్నులు చెల్లించడంలో చూపుతున్న చైతన్యం, తమ వీధుల అభివృద్ధిలో కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నరకప్రాయంగా ‘గ్రామకంఠం’ వీధులు

మున్సిపాలిటీలోని 14, 15 వార్డుల పరిస్థితి దయనీయంగా మారింది. నాటి గ్రామకంఠం వీధులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఎవరికి తోచినట్లు వారు వీధులను కబ్జా చేయడంతో, కనీసం కారు వెళ్లడానికి కూడా సందు లేని పరిస్థితి నెలకొంది. అగ్నిప్రమాదం సంభవిస్తే ఫైర్ ఇంజన్ వెళ్లడానికి, అనారోగ్యం పాలైతే అంబులెన్స్ రావడానికి వీలులేని ఇరుకైన సందులు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. చివరికి అంతిమ యాత్రకు పాడె మోయడం కూడా కష్టతరంగా మారిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పథకాలున్నా.. ప్రయోజనం శూన్యం..

కేంద్ర ప్రభుత్వం ఆబాది ప్రాంతాల ప్రక్షాళన కోసం ‘స్వామిత్వ యోజన‘ వంటి పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు నామమాత్రంగానే ఉంది. వీధుల విస్తరణ జరగకుండా ఎన్ని కోట్ల నిధులు వెచ్చించినా అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

నేతల మౌనం.. ఓటు బ్యాంకు భయం..

వీధుల విస్తరణపై మాట్లాడితే ఎక్కడ ఓట్లు పోతాయో అన్న భయంతో స్థానిక నాయకులు పెదవి విప్పడం లేదు. నాయకులు మారుతున్నా, ఆబాది వీధులకు మాత్రం మోక్షం కలగడం లేదు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి వీధులను కొలతలు వేసి, ఆక్రమణల నుండి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పెరిగిన చార్జీలు.. అవే పాత పద్ధతులు..

మున్సిపాలిటీగా మారిన తర్వాత సౌకర్యాలు పెరుగుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైంది.

బిల్లుల బాదుడు..

విద్యుత్, నీటి చార్జీలు భారీగా పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపారు. మున్సిపల్ హోదా వచ్చినా, చెత్త సేకరణ పాత గ్రామపంచాయతీ తరహాలోనే ’డే బై డే’ సాగుతోంది.మిషన్ భగీరథ నీరు పాత పద్ధతిలోనే వస్తోంది. కొత్తగా ట్యాంకులు కట్టడం గానీ, పైపులైన్ల విస్తరణ గానీ చేపట్టిన దాఖలాలు లేవు.విశాలమైన రోడ్లు లేకనే స్థానికులు వెంచర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వీధుల విస్తరణకు ప్రజలు అధికారులకు సహకరించాలి. నాయకులు కూడా స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి మెజారిటీ ప్రజల ప్రయోజనం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.