23 March, 2026 | 1:13 AM

మస్క్ సంపద 600 బిలియన్ డాలర్స్

17-12-2025 01:07 AM

స్పేస్‌ఎక్స్ పబ్లిక్ ఇష్యూకి రానుందన్న వార్తలతో భారీగా పెరిగిన సంపద

వాషింగ్టన్, డిసెంబర్ 16: టెక్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు సృష్టించారు. 600 బిలియన్ డాలర్ల నికర సంపదను సాధించిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర నెలకొల్పారు ఫోరబ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం నాటికి ఆయన ఈ ఘనత సాధించారు. ముఖ్యంగా ఆయనకు చెందిన స్పేస్ టెక్నాలజీ సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుందన్న వార్తలే ఈ భారీ పెరుగుదలకు కారణంగా నిలిచాయి.

స్పేస్‌ఎక్స్‌ను సుమారు 800 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో పబ్లిక్ లిస్టింగ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. స్పేస్‌ఎక్స్‌లో మస్క్‌కు దాదాపు 42 శాతం వాటా ఉంది. ఈ వాల్యుయేషన్ ప్రకారం ఒక్క స్పేస్‌ఎక్స్ నుంచే ఆయన సంపదకు 168 బిలియన్ డాలర్లు అదనంగా చేరతాయి. దీంతో సోమవారం నాటికి ఆయన మొత్తం సంపద 677 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫోరబ్స్ అంచనా వేసింది.

గత అక్టోబర్‌లోనే మస్క్ 500 బిలియన్ డాలర్ల మార్క్ను దాటిన విషయం తెలిసిందే. మస్క్ సంపద పెరగడానికి టెస్లా, ఎక్స్‌ఏఐ కంపెనీలు కూడా దోహదం చేస్తున్నాయి. ఈ పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు మస్క్, టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్‌ఏఐ సంస్థలు వెంటనే స్పందించలేదని రాయిటర్స్ తెలిపింది.