రామాపురంలో వైభవంగా ముత్యాలమ్మ బోనాలు పండుగ
నేరేడుచర్ల, ఆగస్టు 23(విజయ క్రాంతి): నేరేడుచర్ల మున్సిపాల్టీ పరిధిలోని రామాపురంలో ఆదివారం నాడు బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. గ్రామదేవత ముత్యాలమ్మకు మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే నైవేద్యాలు సిద్ధం చేసుకున్న మహిళలు బోనాలను అందంగా అలంకరించి నెత్తిన ఎత్తుకుని మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ సందడి నెలకొంది.
సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని, గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన బోనాల వేడుకల్లో ఎస్ఐ గోపాల్ రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్ వాసా జ్యోతి శేఖర్, గ్రామ పెద్దలు కొదమ గుండ్ల నాగరాజు, చందమల్ల వెంకన్న, చందమల్ల లక్ష్మయ్య, సామ సురేష్, శివనేని విజయ్, అనిల్, ఏసు గ్రామ మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






