calender_icon.png 21 February, 2026 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరవణె పుస్తక వివాదం!

14-02-2026 12:00:00 AM

భారత మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె ఆత్మకథ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం వివాదాస్పదంగా మారింది. తాను సర్వీసులో ఉన్నప్పుడు కేంద్రం ప్రభుత్వం సున్నితమైన అంశాలపై తీసుకున్న నిర్ణయాలను నరవణె తన ఆత్మకథలో ప్రచురించడమే చర్చకు తెరలేపింది. ఇప్పుడు అదే పుస్తకాన్ని ఆయుధంగా చేసుకున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో వాదనకు దిగారు. మరోవైపు నరవణె పుస్తకం అధికారికం కాదని కేంద్రం పేర్కొంటుంది.

మార్కెట్‌లోకి రాని పుస్తకం రాహుల్ చేతుల్లోకి ఎలా వచ్చిందన్న అంశం వివాదానికి దారీ తీసింది. జనరల్ నరవణె తన సర్వీసు కాలంలో జరిగిన కీలక పరిణామాలను పుస్తకంలో పొందుపరిచారు. 2020లో తూర్పు లడాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్- మధ్య ఘర్షణ, ఆ సమయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టే ముందు జరిగిన అంతర్గత చర్చల వంటి అంశాలను పుస్తకంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

దేశ భద్రతకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న వాస్తవాలను ఆయన తన కోణంలో వివరించారు. అయితే 2023 చివర్లో ఈ పుస్తకంలోని కొన్ని భాగాలు బయటకు వచ్చాయి. ఆ సమయంలో చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై నరవణె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అప్పటికే రాజకీయంగా సున్నితమైన అంశాలపై ఒక మాజీ సైన్యాధిపతి ఆత్మకథ రూపంలో రాయడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. తాజాగా రాహుల్ గాంధీ నవరణె పుస్తకానికి సంబంధించిన నకిలీ కాఫీని పార్లమెంటులో ప్రదర్శించడం, అందులోని అంశాలను ప్రస్తావించే ప్రయత్నంలో అధికార వర్గం అడ్డుపడడంతో వివాదం రాజుకుంది.

ఇక నరవణె పుస్తకాన్ని ముద్రణ లేదా డిజిటల్ రూపంలో తాము మార్కెట్లోకి విడుదల చేయలేదని ప్రచురణ సంస్థ పెంగ్విన్ ఇండియా స్పష్టం చేసింది. నకిలీ ప్రతులు మార్కెట్‌లో దొరకడం కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, ఈ చర్యలకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేసింది. మరోవైపు మాజీ ఆర్మీ జనరల్ నరవణె తన ఆత్మకథ వివాదంపై స్పందించారు.

పెంగ్విన్ ఇండియా విడుదల చేసిన స్టేట్‌మెంట్‌ను రీట్వీట్ చేస్తూ వారు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ‘ఇదీ పరిస్థితి’ అని పేర్కొన్నారు. ఇప్పటికే పెంగ్విన్ ఇండియా సంస్థపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు రక్షణ శాఖ నుంచి అనుమతులు రాకముందే పుస్తకం మార్కెట్లోకి ఎలా వెళ్లిందన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నేరుగా ఎక్కడా తప్పుపట్టడం లేదు, అలాగే ప్రచురణకు కూడా అనుమతించడం లేదు. పుస్తకంలోని విషయాలు అబద్ధమని, దేశ భద్రతకు ముప్పు అని కూడా స్పష్టంగా ఎక్కడా పేర్కొనలేదు.

కేవలం అనుమతుల ప్రక్రియను సాగదీస్తూ పుస్తకాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. పార్లమెంటులో కూడా పుస్తకం అధికారికంగా విడుదల కాలేదు కాబట్టి దాని గురించి చర్చించలేమన్న కారణాన్ని సాకుగా చూపి ప్రభుత్వం తప్పించుకుంది. అయితే ఒక మాజీ సైన్యాధిపతి తన అనుభవాలను రాసుకోవడం ప్రజాస్వామ్య దేశంలో ఎవరూ అడ్డుకోలేరు. కానీ అది రాజకీయంగా ఇబ్బందికర అంశంగా మారినప్పుడు వ్యవస్థలు ఎలా స్పందిస్తాయనే దానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ.