27 February, 2026 | 7:31 AM

ఆర్ట్స్ కళాశాలలో ముగిసిన జాతీయ సదస్సు

27-02-2026 12:00 AM

హనుమకొండ,ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఆధునిక గ్లోబల్ నిర్మాణంలో సమకాలీన సమస్యలు అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం సాయంత్రం విజయవంతంగా ముగిసింది.  ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ, మారుతున్న కాలానుగుణ పరిస్థితుల్లో వర్తక వ్యవహారాలు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తున్నాయని తెలిపారు.

గ్లోబలైజేషన్ నేపథ్యంలో వ్యాపార రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నూతన వ్యూహాలు అవసరమని సూచించారు. వెస్ట్ బెంగాల్ వర్సిటీ అధ్యాపకులు డాక్టర్ రాజేంద్ర నాయర్, విభాగ ఆచార్యులు వరలక్ష్మి, అమరవేణి, ఆరట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ ప్రసంగిస్తూ, గ్లోబల్ ప్రపంచం రోజురోజుకు విస్తరిస్తోందని, విద్యార్థులు సమకాలీన పరిణామాలను అర్థం చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ, సమకాలీన గ్లోబల్ మార్పులకు అనుగుణంగా విద్యార్థులు వ్యాపార రంగంలో నూతన ఆలోచనలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సెమినార్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ సదస్సు 150 పత్రాలు వచ్చాయని, విజయవంతానికి సహకరించిన అధ్యాపకులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.