దళిత బీజేపీ కౌన్సిలర్ షాపు కూల్చివేతపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్
వేములవాడ ఘటనపై కలెక్టర్, ఎస్పీ, దేవాదాయ కమిషనర్‌కు నోటీసులు
15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు
బాధితుడి ఫిర్యాదుపై కమిషన్ చర్యలు
వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దళిత బీజేపీ కౌన్సిలర్ కొండ్లెపు ముత్యం షాపు కూల్చివేత ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన కమిషన్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది. షాపు కూల్చివేతకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, బాధితుడి ఫిర్యాదుపై విచారణ పురోగతి తదితర అంశాలతో కూడిన సమగ్ర నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని సంబంధిత అధికారులను కమిషన్ ఆదేశించింది. గత నెలలో వేములవాడ 17వ వార్డు బీజేపీ కౌన్సిలర్, దళిత నాయకుడు కొండ్లెపు ముత్యం నిర్వహిస్తున్న షాపును ఆలయ అధికారులు, సిబ్బంది తొలగించిన విషయం తెలిసిందే.
తాను దళితుడిననే కారణంతోనే కక్షపూరితంగా తన షాపును లక్ష్యంగా చేసుకుని కూల్చివేశారని ముత్యం ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. దీంతో గత నెల 20న జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ, ఘటనపై పూర్తి వివరణతో కూడిన నివేదికను 15 రోజుల్లోగా అందజేయాలని ఆదేశించారు. శనివారం 17వ వార్డు కౌన్సిలర్ కొండ్లెపు ముత్యం, బిజెపి కౌన్సిలర్ తో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కొండ్లెపు ముత్యం మాట్లాడుతూ... గత నెల రోజులుగా షాపు ఖాళీ చేయాలని ఆలయ అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ వచ్చి వేధింపులకు గురి చేశారని బాధితుడు ఆరోపించారు. నెల 4వ తేదీన డీఈఓ భాస్కర శర్మ ఆధ్వర్యంలో సుమారు 20 మంది అధికారులు, సిబ్బంది వచ్చి తన షాపును పూర్తిగా ధ్వంసం చేసి సుమారు రూ.1 లక్ష మేర నష్టం కలిగించారని తెలిపారు. అనంతరం మీడియాకు "ల్యాండ్ ప్రొటెక్షన్ విభాగం" పేరుతో దేవాలయం ముందు ఆక్రమణ తొలగించామని ప్రకటించారని, అయితే ఆ విభాగాన్ని ఎవరు ఏర్పాటు చేశారో, ఏ అధికారుల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారో స్పష్టత లేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.
2020లో శుభ్రం వెల్ఫేర్ సొసైటీ సునీల్ మిశ్రా అనే వ్యక్తి సులభ్ కాంప్లెక్స్‌ను మున్సిపాలిటీ ఒప్పందం ద్వారా కేటాయించిందని, ఆ స్థలం మున్సిపల్ పరిధిలోనే ఉందని పేర్కొన్నారు. దేవాలయానికి సంబంధం లేని స్థలాన్ని దేవాలయ భూమిగా పేర్కొంటూ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా షాపు తొలగించారని ఆరోపించారు. మోచి కులం పేరుతో అవమానించారని, దళితుడిననే కారణంతో కక్షసాధింపుకు పాల్పడి, కులం పేరుతో దూషించడంతో పాటు ఆర్థికంగా నష్టపరిచారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.16వ వార్డు కౌన్సిలర్ వంగల శ్రీనివాస్ మాట్లాడుతూ, గత నెలలో 20 నుంచి 30 మంది ఆలయ అధికారులు, సిబ్బంది షాపు వద్దకు వచ్చి ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడ్డారని, తమ సమక్షంలోనే దౌర్జన్యానికి దిగారని తెలిపారు.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, డీఎస్పీ, పట్టణ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆలయ ఈవోపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. దీంతో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, దేవాదాయ శాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసి, 15 రోజుల్లో కేసు నమోదు, విచారణ, బాధితుడికి నష్టపరిహారం అంశాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు వంగల శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కౌన్సిలర్లు మైలారం శ్రీనివాస్, నాయకులు బోనాల శివ, మామిండ్ల లక్ష్మీరాజ్యం తో పాటు తదితరులు ఉన్నారు.






