ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత
మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, మే 25 (విజయక్రాంతి): అడవుల నరికివేత, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.1.44 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన జిల్లా అటవీశాఖ కార్యాలయ భవనాన్ని జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, టిజిఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి మంత్రి సురేఖ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా బొంతపల్లి సమీపంలో అమృతవనం, హరితవనం పేర్లతో రెండు ఆధునిక ఎకో పార్కులను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. సంగారెడ్డి, పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదించేలా పార్కుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. పర్యాటకుల స్పందన ఆధారంగా ‘నైట్ స్టే’ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
అడవుల సంరక్షణ కోసం అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, రిజర్వ్ ఫారెస్టుల చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అడవి జంతువులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే నారాయణఖేడ్, జహీరాబాద్తో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకృతి వనాల ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటి, దానిని సంరక్షించడం ద్వారా ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.
ప్రకృతి సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ ద్వారానే భావితరాలకు భద్రమైన భవిష్యత్ అందించగలమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వన మహోత్సవ కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, ప్రకృతి వనాలను అభివృద్ధి చేయడం జరుగుతోందని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా బొంతపల్లి వద్ద ఏర్పాటు చేసిన అమృతవనం, హరితవనం వంటి ఎకో పార్కులు ప్రజలకు ప్రకృతి సౌందర్యాన్ని చేరువ చేయడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, జిల్లా అటవీశాఖ అధికారి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అమృతవనం, హరిత ద్వారం ఫారెస్ట్ పార్కులు ప్రారంభం
ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ
గుమ్మడిదల, మే 25 : గుమ్మడిదల మున్సిపాలిటీ, మండలంలోని బొంతపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అమృతవనం ఎకో ఫారెస్ట్ పార్క్, మంబాపూర్ గ్రామంలోని హరిత ద్వారం ఫారెస్ట్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా హాజరై పార్కులను ప్రారంభించారు. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మంత్రితో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






