23 July, 2026 | 5:19 PM

పార్లమెంట్‌లో నీట్ రచ్చ

29-06-2024 01:06 AM

పేపర్ లీక్‌పై చర్చించాలని విపక్షాల డిమాండ్

వెల్‌లోకి దూసుకెళ్లిన ప్రతిపక్ష ఎంపీలు

దీంతో సోమవారాని సభ వాయిదా

రాహుల్ మైక్ ఆఫ్ చేశారని కాంగ్రెస్ ఆరోపణ

రాజ్యసభలోనూ నెలకొన్న గందరగోళం

న్యూఢిల్లీ, జూన్ 28: కొత్త లోక్‌సభ ఏర్పాటైన నేపథ్యంలో నిర్వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో శుక్రవారం గందరగోళం నెలకొంది. నీట్ పేపర్ లీక్‌పై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టి నిరసన వ్యక్తం చేయడంతో సభ సోమవారానికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతిచెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిపై చర్చను స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించగా.. ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని లేవనెత్తాయి.

ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సైతం ఈ అంశంపై మాట్లాడాలని డిమాండ్ చేశాయి. సభలో విపక్షాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనా విపక్ష నేతలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు వారిస్తూ ధన్యవాద తీర్మానంలో చర్చిద్దామని తెలిపారు. కానీ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఇవన్నీ పట్టించుకోరని, వాళ్లకు న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటారని స్పష్టం చేశారు. దీంతో స్పీకర్ మాట్లాడుతూ.. సభ సంప్రదాయాలను పాటించాలని సూచించారు.

ప్రోసీడింగ్స్‌ను అడ్డుకోవద్దన్నారు. సభ అందరికీ అవకాశమిస్తుందని తెలిపారు. అయినా కాంగ్రెస్ సహా టీఎంసీ, డీఎంకే సభ్యులు వెల్‌లోకి వచ్చి గందరగోళం సృష్టించారు. దీంతో సభను సోమవారం (జూలై 1)కి స్పీకర్ వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే గందరగోళం కనిపించింది. నీట్ అంశంపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తుండగానే ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో చర్చను చైర్మన్ చేపట్టారు. 

రాహుల్ మైక్ ఆపేశారు

అంతకుముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ నీట్ అంశాన్ని లేవనెత్తగానే మైక్ ఆపేశారని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ఆరోపించింది. ఇందుకు సంబంధించి వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో మైక్రోఫోన్‌లో మాట్లాడేందుకు అవకాశమివ్వాలని స్పీకర్‌ను రాహుల్ కోరడం కనిపిస్తోంది. నీట్‌పై ఇప్పటివరకు ప్రధాని మోదీ స్పందించలేదు. సభలో యువత కోసం రాహు ల్ మాట్లాడుతున్నారు. ఈ సమయం లో మైక్ ఆఫ్ చేయడం చౌకబారు చర్య. యువత గొంతు నొక్కేందుకు కుట్ర చేస్తున్నారు అని కాంగ్రెస్ మండిపడింది. ఈ విషయంపై స్పందించిన ఓం బిర్లా.. తాను సభ్యుల మైక్రోఫోన్ ఆఫ్ చేయనని, అలాంటి నియంత్రణ ఏదీ తన వద్ద ఉండదని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంలో ఇతర విషయాలు రికార్డు కావని తెలిపారు. కాగా, నీట్ వివాదంపై చర్చ జరగాలని, దీనిపై కేంద్రం ప్రకటన చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. నీట్‌పై సభలో అర్థవంతమైన, గౌరవ ప్రదమైన చర్చను మోదీనే చేపట్టాలని స్పష్టం చేశారు.