03-02-2026 06:54:42 PM
తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్‌నగర్,(విజయక్రాంతి): ఎంతో ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కు అనుగుణంగా సౌకర్యాలను పెంచాల్సిన అవసరం ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక 4.21 కోట్ల రూపాయల వ్యయంతో జీ ప్లస్ త్రీ పద్దతిలో చేపట్టిన కిచెన్, డైనింగ్ హాల్ భవన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా ఎల్లమ్మ అమ్మవారి ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
పూజల అనంతరం భవన నిర్మాణ పనుల గురించి అధికారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. గ్రౌండ్ లో వాహనాల పార్కింగ్, మొదటి అంతస్తులో కిచెన్, రెండు, మూడు ప్లోర్ లలో డైనింగ్ హాల్ ఏర్పాటు చేసేలా భవనం డిజైన్ చేసినట్లు అధికారులు వివరించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 2014 లో తాను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాతనే అమ్మవారి ఆలయం వద్ద అనేక అభివృద్ధి పనులు చేపట్టడం, భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరిగిందని ఆయన వివరించారు.
గతంలో అమ్మవారి కళ్యాణం ఆలయం లోపల పరిమితి సంఖ్య కలిగిన భక్తుల సమక్షంలో జరిగేదని, తాను ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత ఆలయం ముందు, పక్కన భారీ రేకుల షెడ్డులను నిర్మించడం జరిగిందని చెప్పారు. ఆలయం బయట కళ్యాణం నిర్వహిస్తున్న నాటి నుండి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. దాదాపు 7 నుండి 8 లక్షల మంది వరకు భక్తులు అమ్మవారి కల్యాణానికి వస్తున్నారని అన్నారు. ఆలయం వద్ద రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు చేపట్టడం, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య, ఆలయ ఆదాయం కూడా పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు.
గతంలో ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజులలో 30 వేల మంది వరకు భక్తులు వచ్చే వారని, ప్రస్తుతం లక్ష మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారని తెలిపారు. ఆలయం వద్ద వివిధ రకాల పూజా సామగ్రి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వారికోసం బోనం కాంప్లెక్స్ వద్ద షాపులను దాతల సహకారంతో నిర్మించి ఉచితంగా కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆలయం సమీపంలో మల్టి లెవెల్ పార్కింగ్ భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు.
ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల చేయకపోవడం తో పనులు నిలిచిపోయాయని అన్నారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా భక్తుల సంఖ్య ను దృష్టిలో ఉంచుకొని ఆలయం వద్ద టాయిలెట్స్ సంఖ్య ను కూడా పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, EO శంకర్, హైమావతి, అమీర్ పేట సర్కిల్ DC సుజాత, DE మహేష్, టూరిజం DE హన్మంత రెడ్డి, ఎలెక్ట్రికల్ DE సుధీర్, శానిటేషన్ DE వెంకటేష్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, పీయూష్ గుప్తా, వనం శ్రీనివాస్, కుమార్, సీనియర్ సిటీజన్స్ పార్థసారధి, రాజేష్ ముదిరాజ్, కూతురు నర్సింహ, కట్టా బలరాం, శ్రీనివాస్ గౌడ్, వేణుగౌడ్, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.