నీట్ పరీక్ష రద్దు చేయలేం
రద్దుచేస్తే దాని ప్రతిష్ఠ దెబ్బతింటుంది
నీట్ కౌన్సెలింగ్‌ను కూడా ఆపలేం
తెలుగు విద్యార్థుల పిటిషన్లపై సుప్రీం
న్యూఢిల్లీ, జూన్ 11: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలను రద్దుచేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ కౌన్సెలింగ్‌ను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది. పరీక్ష పూర్తయ్యి ఫలితాలు కూడా వచ్చినందున ఇప్పుడు అందులో జోక్యం చేసుకొంటే నీట్ పరీక్ష విశ్వసనీయ, పవిత్రత దెబ్బతింటాయని పేర్కొన్నది.
నీట్‌లో అక్రమాలు జరిగాయని, అందువల్ల ఫలితాలను రద్దుచేసేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అహసానుద్దిన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ‘పరీక్షను, ఫలితాలను రద్దుచేయటం అంత తేలిక కాదు. అలా చేస్తే పరీక్ష విశ్వసనీయత దెబ్బతింటుంది. కౌన్సెలింగ్‌ను మేం ఆపలేం’ అని ప్రకటించింది. నీట్‌లో అవకతవకలు జరిగాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. పరీక్షను రద్దుచేయాలని కోరారు.
గ్రేస్ మార్కులను కలుపటంలో ఎన్టీఏ వివక్ష చూపించిందని ఆరోపించారు కొందరు విద్యార్థులకు ఏ రకంగా గణించినా సాధ్యం కాని స్కోర్లు ఇచ్చిందని కోర్టు దృష్టికి తెచ్చారు. అసలు గ్రేస్ మార్కులను ఎందుకు కలిపారనేదానికి కారణం కారణం లేదని, ఆ గ్రేస్ మార్కులు ఏ లెక్కన, ఎవరెవరికి కలిపారో కూడా లిస్టు వెల్లడించలేదని తెలిపారు. పైగా గ్రేస్ మార్కులను కలుపటం సమయాన్ని వృధా చేయటమేనని వాదించారు. గ్రేస్ మార్కులు ఉంటాయని పరీక్షకు ముందు విడుదల చేసిన సమాచార బులిటెన్‌లో కూడా తెలుపలేదని గుర్తుచేశారు.
౭౨౦కి ౭౨౦ మార్కులు సాధించిన ౬౭ మంది ఒకే కోచింగ్ సెంటర్‌కు చెందినవారని తెలిపారు. ఎన్టీఏ విడుదల చేసిన ప్రాథమిక కీలో తప్పులను దాదాపు ౧౩ వేల మంది విద్యార్థులు ఎత్తిచూపారని, అయినా వాటిని ఎన్టీఏ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. నీట్ పరీక్షలో అక్రమాలకు పాల్పడి పాస్ కావటాన్ని సాంకేతికంగా లోతుగా అర్థంచేసుకోవాలని, ఈ అక్రమాలు అంతిమంగా ప్రజలు, రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతాయని పేర్కొన్నారు. పరీక్షలో అక్రమాలకు పాల్పడటం సమానత్వానికి, మెరిట్ సిద్ధాంతాలకు విరుద్ధమని తెలిపారు.
‘కొందరు పేపర్ లీకేజీలకు పాల్పడటం కష్టపడి చదివే ఎంతోమందికి నష్టం కలిగిస్తుంది. అది అంతిమంగా మొత్తం సమాజానికే నష్టం కలిగిస్తుంది’ అని వాదించారు. అయితే, పిటిషనర్లు కోరినట్టు పరీక్షను రద్దుచేసేందుకు కోర్టు ఒప్పుకోలేదు. తదుపరి విచారణను జూలై ౮వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఉన్న ఇలాంటి పిటిషన్లనే కలిపి విచారిస్తామని ప్రకటించింది. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, ఎన్టీఏకు ఆదేశాలు జారీచేసింది.
నీట్‌పై సీబీఐ విచారణ జరపాలి
ఓయూలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేసిన నాయకులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (విజయక్రాంతి): నీట్ 2024ను రద్దు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ ఓయూ అధ్యక్షుడు మేడ శ్రీను డిమాండ్‌చేశారు. ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ దిష్టి బొ మ్మ దహనం చేశారు. నీట్ పరీక్ష రాసిన వారిలో ఒకే సెంటర్‌లోని ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులు రావడం పేపర్ లీకేజీకి నిదర్శనమని శ్రీను ఆరోపించారు. తిరిగి పరీక్ష నిర్వహించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఎన్‌టీఏపై సీబీఐ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర చందనరెడ్డి, హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వినయ్, ఓయూ వర్కింగ్ ప్రెసిడెంట్ వికాస్ తదితరులు పాల్గొన్నారు.






