గెలిపించినందుకు ధన్యవాదాలు
రాయ్‌బరేలీలో రాహుల్ కృతజ్ఞత సభ
మోదీ విద్వేష రాజకీయాలు చేస్తున్నారు
స్వచ్ఛమైన రాజకీయాల కోసం ప్రజలు ఏకమయ్యారు
అందుకు నాకు చాలా గర్వంగా ఉంది
రాయ్‌బరేలీ, జూన్ 11: ప్రధాని నరేంద్ర మోదీ విద్వేష రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నిర్వహించిన కృతజ్ఞత సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సండర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో తమను గెలిపించిన రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
సభలో ప్రియాంక గాంధీతో పాటు అమేథీ ఎంపీ కిశోరీ లాల్ శర్మ పాల్గొన్నారు. ఈ సభను తొలుత అమేథీలో నిర్వహించాలని భావించినా ఆఖరికి రాయ్‌బరేలీకి మా ర్చారు. లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రె స్ సీనియర్ నేత కిశోరీ లాల్ శర్మ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
స్వచ్ఛమైన రాజకీయాల కోసం..
దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలు కావాలని దేశం మొత్తానికి గట్టి సందేశం ఇవ్వడం చాలా గర్వంగా ఉందని రాహుల్ అన్నారు. ‘ఇది చరిత్రాత్మక విజయం. దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలు కావాలని దేశం మొత్తానికి గట్టి సందేశం ఇచ్చారు. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘ఈ విజయం కోసం రేయింబవళ్లు శ్రమించాం. అన్నయ్యకు అద్భుతమైన గెలుపు అందించిన రాయ్‌బరేలీ ప్రజలకు ధన్యవాదాలు. మీరు మాపై చూపిన ప్రేమ కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం’ అని ప్రియాంక అన్నారు.
ప్రియాంక పోటీ చేస్తే వేరేలా..
వారణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే ప్రధాని మోదీ ఘోరంగా ఓడిపోయే వారని రాహుల్ అన్నారు. 2 లక్షల ఓట్ల మెజారిటీతో ప్రియాంక గెలిచేవారని పేర్కొన్నారు. నరేంద్రమోదీ, అమిత్‌షా రాజ్యాంగాన్ని మార్చేస్తారని దేశం మొత్తం అర్థం చేసుకుందని, అందుకే దేశంలోని ప్రజలు ఏకతాటిపై నిలబడ్డారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కలసిమెలసి పోరాడాయని రాహుల్ కొనియాడారు.






