3 August, 2026 | 3:22 AM

ఒకే షిఫ్ట్‌లో నీట్

03-08-2026 02:07 AM

ఈ నెల 30న పరీక్ష

దేశవ్యాప్తంగా ఒకే ప్రశ్నాపత్రం

ఎన్‌బీఈఎంఎస్‌కు నిర్వహణ బాధ్యతలు

సమయం పెంచి, ప్రశ్నల సంఖ్య తగ్గింపు

210 నిమిషాలు.. 180 ప్రశ్నలు

అభ్యర్థులకు సమీపంలోనే పరీక్ష కేంద్రాల కేటాయింపు

బయోమెట్రిక్, ఐరిస్ వెరిఫికేషన్, కఠిన భద్రతా చర్యలు

నీట్-పీజీ 2026లో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు 

ఎన్‌స్క్రిప్టెడ్ పద్ధతిలో పేపర్ ఎంపిక: కేంద్ర మంత్రి జేపీ నడ్డా 

న్యూఢిల్లీ, ఆగస్టు2: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)ను దేశవ్యాప్తంగా ఒకే షిఫ్ట్‌లో ఒకే ప్రశ్నాపత్రంతో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) నిర్వహించనుంది. దాదాపు 340 నగరాల్లో, 1,300 కంటే ఎక్కువ కేంద్రాల్లో ఈ పరీక్ష ఈ నెల 30న నిర్వహిస్తోంది. ఈసారి సమయం పెంచి ప్రశ్నల సంఖ్య తగ్గించనున్నారు. 210 నిమిషాల్లో 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

పరీక్ష రాసే అభ్యర్థులకు దగ్గర్లోనే పరీక్ష కేంద్రాలు కేటాయించనున్నారు. బయోమెట్రిక్, ఐరిస్ వెరిఫికేషన్, కఠిన భద్రతా చర్యలను తీసుకోనున్నారు. ఆధార్ ఆధారిత ప్రామాణీకరణను పాటించనున్నారు. ప్రశ్నాపత్రం తయారీ, లీకేజీలను నిరోధించేందుకు అనేక పొరల ఎన్‌స్క్రిప్షన్‌ను వినియోగించనున్నారు. నీట్ పరీక్షకు కొద్ది సమయం ముందే ఎన్‌స్క్రిప్టెడ్ పద్ధతిలో పేపర్ ఎంపిక కానుంది. ఈ మేరకు నీట్-పీజీ 2026 పరీక్ష రాసే అభ్యర్థులకు భారీ ఊరట నిచ్చేలా కేంద్ర ప్రభుత్వం పలు కీలక సంస్కరణలను తీసుకొచ్చింది.

ఆగస్టు 30న జరగనున్న ఈ పరీక్ష సన్నాహాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్షించారు. అభ్యర్థులకు అనుకూలంగా, అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా పరీక్ష నిర్వహించేందుకు కేంద్రం ఈ మార్పులు చేపట్టింది. గతంతో పోలిస్తే ఈసారి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 12.5 శాతం పెరిగి, మొత్తం 2,73,183 మందికి చేరింది. పరీక్ష కేంద్రాల కేటాయింపులో ఈసారి ప్రధాన మార్పులు చేశారు. అభ్యర్థులు తమ దరఖాస్తులో మూడు రాష్ట్రాల ప్రాధాన్యతలను తెలియజేయాల్సి ఉంటుంది.

ఇందులో అభ్యర్థి నివాస ప్రాంతం ప్రాథమిక ఎంపికగా ఉండటం నిర్బంధం చేశారు. దీనివల్ల సొంత ఇంటికి దగ్గరలోని కేంద్రాలు లభించే అవకాశం ఉంది. ప్రయాణ ప్రణాళికలు చేసుకునేందుకు వీలుగా పరీక్షకు మూడు వారాల ముందే పరీక్షా నగరం వివరాల స్లిప్‌లను విడుదల చేయనున్నారు. దీంతోపాటు పరీక్ష విధానంలో మార్పు చేస్తూ, 210 నిమిషాల్లో 180 ప్రశ్నలకు సమాధానాలు రాసేలా కుదించారు. సమయం మారకుండా ప్రశ్నల సంఖ్య తగ్గడం వల్ల అభ్యర్థులకు ఒక్కో ప్రశ్నకు ఎక్కువ సమయం లభిస్తుంది. 

భద్రతా చర్యలను మరింత కఠినతరం 

పరీక్ష సమగ్రతను కాపాడేందుకు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశారు. దరఖాస్తు సమయం నుంచి పరీక్ష కేంద్రాల వరకు ఆధార్ ఆధారిత ప్రామాణీకరణను ఉపయోగిస్తున్నారు. వేలిముద్రల గుర్తింపు విఫలమైతే ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా తనిఖీ చేస్తారు.

పరీక్ష కేంద్రాల ముందస్తు సీలింగ్, సీసీటీవీ నిఘా, సిగ్నల్ జామ్మర్లు, డైనమిక్ కంప్యూటర్ కేటాయింపు, ప్రత్యక్ష పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేశారు. మొత్తం 60 వేల మందికి పైగా సిబ్బందిని ఈ విధుల్లో వినియోగిస్తున్నారు. ప్రశ్నాపత్రం తయారీ, లీకేజీలను నిరోధించేందుకు అనేక పొరల ఎన్‌స్క్రిప్షన్‌ను వినియోగిస్తున్నారు.  

ఎన్‌స్క్రిప్టెడ్ పద్ధతిలో పేపర్ ఎంపిక:నడ్డా

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా అభ్యర్థులను పుకార్లు నమ్మవద్దని హెచ్చరించారు. ప్రశ్నాపత్రం ముందస్తుగా లీక్ అయిందనే ప్రచారాలు పూర్తిగా అబద్ధాలని, పరీక్ష ప్రారంభమయ్యే కొద్ది సమయం ముందే ఎన్‌స్క్రిప్టెడ్ పద్ధతిలో పేపర్ ఎంపికవుతుందని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎన్బీఈఎమ్‌ఎస్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరారు. ఏదైనా అక్రమాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక ఈమెయిల్ ఐడీని కూడా అందుబాటులోకి తెచ్చారు.