3 August, 2026 | 3:40 AM

పర్వతారోహకుడు పుర్జా మృతదేహం లభ్యం

03-08-2026 02:05 AM

పీఓకే బ్రాడ్ పీక్‌పై కొనసాగుతున్న సహాయక చర్యలు

ఇస్లామాబాద్, ఆగస్టు 2: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని బ్రాడ్ పీక్ వద్ద వచ్చిన మంచు తుఫాన్‌లో పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా గురువారం గల్లంతైన విషయం తెలిసిందే. మూడు రోజుల రెస్క్యూ తర్వాత ఎట్టకేలకు ఆదివారం పుర్జా మృతదేహం లభించింది.

మూడు రోజుల అనంతరం సుమారు 5,700 మీటర్ల ఎత్తులో ఆయన మృతదేహాన్ని గుర్తించి, వెలికితీసినట్లు ఆల్ప్‌లైన్ క్లబ్ ఆఫ్ పాకిస్తాన్ వెల్లడించింది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది అంతర్జాతీయ పర్వతారోహకులు మరణించగా, ఇప్పటికే ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నాలుగు రోజుల క్రితం మధ్యాహ్నం సమయంలో బ్రాడ్ పీక్ పర్వతంపై సుమారు 7,000 మీటర్ల ఎత్తులో భారీ హిమపాతం సంభవించింది.

ఆల్ప్‌లైన్ క్లబ్ ఆఫ్ పాకిస్తాన్ తెలిపిన వివరాల ప్రకారం.. 43 ఏళ్ల నిర్మల్ పుర్జా మృతదేహం సుమారు 5,700 మీటర్ల ఎత్తులో లభించిందని పేర్కొంది. ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను వెలికితీశామని, మిగిలిన ఐదుగురి కోసం తీవ్ర ప్రతీకూల వాతావరణ పరిస్థితుల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. నిర్మల్ పుర్జాకు పర్వతారోహణలో అద్భుతమైన రికార్డు ఉంది. 2019లో ప్రపంచంలోని 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న 14 పర్వతాలను కేవలం ఆరు నెలల ఆరు రోజుల్లో అధిరోహించి కొత్త రికార్డు సృష్టించారు. ఈ బ్రాడ్ పీక్ అధిరోహణ పూర్తయితే అన్ని 14 పర్వతాలను రెండుసార్లు అధిరోహించిన రికార్డు ఆయన సొంతమయ్యేది.