3 August, 2026 | 2:46 AM

నేమింగ్ బోర్డులపై నిర్లక్ష్యం..

03-08-2026 01:37 AM

ఎగువ మానేరు వద్ద సూచిక బోర్డులపై పేర్లు ఎక్కడ..?

గంభీరావుపేట, ఆగస్టు 2 (విజయక్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద నేమింగ్ బోర్డుల విషయంలో ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాజెక్టు పరిధిలో ఏర్పాటు చేయాల్సిన సూచిక బోర్డులు, ముఖ్యంగా, నీటి సామర్థ్యం, కుడి, ఎడమ కాలువల వివరాలు, ఆయకట్టు విస్తీర్ణం, నీటి పంపిణీ వివరాలు తదితర సమాచారాన్ని అందించే బోర్డులు ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.

ప్రాజెక్టు వద్దకు వచ్చే పర్యాటకులు, రైతులు, స్థానిక ప్రజలు ఈ పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా సరైన సమాచారం లేకపోవడంతో సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులకు అవసరమైన కాలువల వివరాలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రాజెక్టు వినియోగంపై అవగాహన తగ్గుతోందని వారు అంటున్నారు.ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సిన ఈ నేమింగ్ బోర్డులు కేవలం పేరుకే నిలిచిపోయాయని,

వాటిపై వివరాలు రాయకపోవడం వల్ల ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాజెక్టు వద్ద కనీస సమాచార సౌకర్యాలు లేకపోవడం విచారకరమని పేర్కొంటున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద పూర్తి వివరాలతో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న బోర్డులను సక్రమంగా వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.