04-12-2025 12:55:20 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 3 : భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల నిధులను ఉపయోగించి నెహ్రూ బాబ్రీ మసీద్‌ను నిర్మించాలని అనుకున్నారని ఆయన ఆరోపించారు. దీనిని సర్దార్ వల్లాభాయ్ పటేల్ అడ్డుకున్నారని తెలిపారు. ఇంకా పటేల్ మరణానంతరం ఆయన స్మారకం కోసం ప్రజలు సేకరించిన నిధులను రోడ్లు, బావుల కోసం వినియోగించాలని నెహ్రూ సూచించినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.
సర్దార్ వల్లాభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్ వడోదరలో నిర్వహించిన ఐక్యతా ర్యాలీలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ‘ప్రజాధనంతో అయోధ్యలో బాబ్రీ మసీద్‌ను నిర్మించాలని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ అనుకున్నారని, ఈ ప్రతిపాదనను గుజరాతీ బిడ్డ సర్దార్ వల్లాభాయ్ పటేల్ అడ్డుకున్నారని రాజన్‌నాథ్ చెప్పారు. ప్రజల నిధులతో మసీద్‌ను కట్టడానికి పటేల్ అసలే అంగీకరించలేదన్నారు.
దీంతో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయ పునర్‌నిర్మాణాన్ని నెహ్రూ ప్రశ్నించారని పేర్కొన్నారు. ఆలయ పునరుద్ధరణకు అవసరమైన రూ.30 లక్షలను ప్రజలు విరాళంగా ఇచ్చారని, అది పూర్తిగా విభిన్నమైన అంశమని పటేల్ స్పష్టం చేశారని తెలిపారు. ట్రస్టును ఏర్పాటుచేసి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సొమ్మును తీసుకోకుండా సోమనాథ్ ఆలయాన్ని పునర్ నిర్మించారని పటేల్ నెహ్రూకు తెలిపారు.
అచ్చం అలాగే అయోధ్యలోని రామాలయం నిర్మించడానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మొత్తం ఖర్చును దేశ ప్రజలే భరించారు. దీనినే నిజమైన లౌకికవాదం అంటారని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. వాస్తవానికి సర్దార్ పటేల్ దేశానికి తొలి ప్రధానమంత్రి కావాలని అభిప్రాయపడ్డారు.
కానీ ఆయన తన రాజకీయ కెరీర్‌లో ఎప్పుడూ హోదాల కోసం పాకులాడలేదని తెలిపారు. ప్రధానమంత్రి అయ్యేందుకు పటేల్‌కు వయసు అడ్డంకిగా మారిందన్న వాదనలను రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. 80ఏళ్ల వయసులో మొరార్జీ దేశాయ్ దేశానికి ప్రధాని అయినప్పుడు, అంతకంటే తక్కువ వయసున్న పటేల్‌కు ఎందుకు అర్హత ఉందన్నారు.
పటేల్ స్మారకం నిధులను మళ్లించిన నెహ్రూ
1946లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉందని, అందులో మెజారిటీ సభ్యులు వల్లాభాయ్ పటేల్ పేరును ప్రతిపాదించారని రాజ్‌నాథ్ అన్నారు. కానీ గాంధీజీ వచ్చి నెహ్రూ ను అధ్యక్షుడిగా చేయాలని, అందుకోసం తప్పుకోవాలని సూచించారు. దీంతో పటేల్ వెంటనే తన దరఖాస్తును విత్‌డ్రా చేసుకున్నారని చెప్పారు. పటేల్ మరణానంతరం ఆయన స్మారకం కోసం పౌరులు నిధులు సేకరించారని, ఈ విషయం నెహ్రూకు తెలియగానే, పటేల్ రైతుల నేతని, అందుకోసం ఈ నిధులను గ్రామాల్లో బావులు, రోడ్లకు ఉపయోగించాలని చెప్పారని ఆరోపించారు.
వాస్తవానికి బావులు, రోడ్లను నిర్మించడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఎలాగైనా పటేల్ ఖ్యాతిని అణగదొక్కాలని అప్పటి ప్రభుత్వం భావించింద న్నారు. నెహ్రూజీ స్వయంగా ఆయనే భారతరత్న ఇచ్చుకున్నారు. కానీ సర్దార్ వల్లాభాయ్ పటేల్‌కు ఎందుకు భారతరత్న ఇచ్చి గౌరవించలేదని, ప్రధాని మోదీ మాత్రం స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మించి వల్లాభాయ్ పటేల్‌కు దక్కాల్సిన గౌరవాన్ని అందించారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.