2 March, 2026 | 10:06 PM

నేరెళ్ల శైలజకు ఓబీసీ ఆధ్వర్యంలో ఘన సన్మానం

02-03-2026 08:26 PM

హన్మకొండ,(విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగంలో ‘ఆహార–ఆహారేతర పంటల ఆర్థిక విశ్లేషణ’ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన నేరెళ్ల శైలజ ను ఓబిసి జాక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసిన శైలజను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని ఓబీసీ కార్యాలయంలో  సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓబీసీ అధ్యక్షుడు, మాస్టర్ జీ విద్యాసంస్థల చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ... కుటుంబ బాధ్యతలను నిర్వర్తించుకుంటూనే పేదరికాన్ని ఆయుధంగా మలుచుకొని కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి పీహెచ్‌డీ సాధించడం గొప్ప విషయమన్నారు. మహిళలు డాక్టర్ శైలజను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత విద్యలో రాణించాలని, మెరుగైన ఉపాధి అవకాశాలు సాధించాలని ఆకాంక్షించారు.

రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ గడ్డం భాస్కర్ మాట్లాడుతూ... నేరెళ్ల శైలజ సాధారణ కార్మిక కుటుంబానికి చెందినవారని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యను అభ్యసించి తన పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పొందడం తనకు ఆనందంగా ఉందన్నారు. పీహెచ్‌డీతో ఆగిపోకుండా పోస్ట్‌డాక్టోరల్ పరిశోధనలు చేయాలని, జాతీయ–అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని మారుతున్న పరిస్థితులను అవగాహన చేసుకోవాలని, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

ఓబీసీ మహిళా నేత మాదం పద్మజా రాణి మాట్లాడుతూ... మహిళలు శైలజ లాగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జాయింట్ సెక్రటరీ వేణుమాధవ్, తాళ్లపల్లి రామస్వామి గౌడ్, బోనగిరి యాదగిరి గౌడ్, సంధ్య రాణి, ఓబీసీ జాయింట్ సెక్రటరీ ఎంఎన్ మూర్తి, చక్రపాణి, ధర్మసేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అనగంటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.