తెరపైకి కొత్తందాలు
తెలుగు ప్రేక్షకులు కళా పోషకులు. సినిమా బాగుంటే చాలు ఆదరించేస్తారు. దీంతో ఏటా తెలుగు తెరకు వందల మంది పరిచయమవుతున్నారు. కథానాయికలకైతే టాలీవుడ్ పుష్పక విమానమే! ఎంత మంది వస్తున్నా మరొకరికి చోటు మిగిలే ఉందంటూ స్వాగతం పలికేస్తుంటుందీ తెలుగు చిత్రసీమ. అలా ఆహ్వానం అందుకున్న ఇద్దరు యువతులు త్వరలో తెరపై కథానాయికలుగా మెరవనున్నారు. ఆ కొత్తందాల గురించి తెలుసుకుందాం..
తెలంగాణ యాస సైన్మాలో మణిక
మంచి నటీనటులు చిక్కాలని కోరుకుంటూ ప్రతిభావంతుల కోసం వేట సాగించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు మణిక చిక్కాల చిక్కింది. ఈ సంస్థ గతంలో ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి చిత్రాలను నిర్మించింది. ఇప్పుడు మరో కొత్త సినిమాకు సిద్ధమైంది. ఈ సంస్థ ఐదో ప్రొడక్షన్‌గా రూపొందుతున్న చిత్రం కోసం ఇటీవల ఆసక్తికరంగా క్యాస్టింగ్ కాల్ నిర్వహించారు. ‘మా సైన్మాలో నటించనీకి తెలంగాణ యాస తెల్సిన అన్ని వయసుల ఆడోళ్లు, మొగోళ్లు గావాలె. ఓ రెండు మూడు ఎడిట్ జెయ్యని ఫోట్వలతో ఒక నిమిషం వీడియో సుత పంపుర్రి’ అంటూ చాలా ఆసక్తిక రంగా.. తెలంగాణ యాసలో నూతన నటీనటులకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మౌనిక చిక్కాల అనే యువతి ఎంపికైనట్టు తెలుస్తోంది. క్యాస్టింగ్ కాల్ నిబంధన ప్రకారం.. మణిక పక్కా తెలంగాణ యాసతో ఆకట్టుకోనున్నట్టు తెలుస్తోంది. అంటే.. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ వారి ఐదో చిత్రంతో మణిక కథానాయికగా పరిచయం కానుందన్నమాట. మరి యాస పలకడం లో సాయిపల్లవిని మరిపిస్తుందే లేదో చూడాలి. ఈ చిత్రానికి రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటివరకైతే ఎలాంటి వివరా లనూ అధికారికంగా వెల్లడించ లేదు. త్వరలో ప్రకటిం చను న్నారు.
మహేశ్‌బాబు, నాగార్జున, రవితేజ వంటి ప్రముఖ కథానాయకులతో పలు సినిమాలను అందించాయి ఇనావర్స్ సినిమా ఫ్యాక్టరీ, రాస్ర ఎంటర్‌టైన్‌మెంట్. ఈ సంస్థలు సంయుక్తంగా రూపొంది స్తున్న మరో నూతన చిత్రం ‘ఏ రోజైతే చూశానో నిన్ను’. ఈ సినిమా ద్వారా ఓ యువ నటి హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కానుంది. ‘చార్లీ 777’, ‘జాగ్వార్’ లాంటి పలు కన్నడ చిత్రాల్లో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య గౌడ. ఈ బ్యూటీనే తాజా చిత్రం ‘ఏ రోజైతే చూశానో నిన్ను’ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మరో బాల నటుడు భరత్‌రామ్ కూడా ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. భరత్‌రామ్.. ‘చెక్’, ‘బుర్రకథ’, ‘రంగరంగ వైభవంగా’ వంటి సినిమాల్లో చైల్డ్ హీరోగా నటించి మెప్పించాడు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు రాజు బొనగాని దర్శకత్వం వహించనున్నారు. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.






