12 May, 2026 | 12:08 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

దగ్గరుండి కూలుస్తా

29-08-2024 06:55 AM
  1. కేటీఆర్ లిస్ట్ ఇస్తే చాలు
  2. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు కూల్చుడే
  3. మొదట పడగొట్టింది మా పల్లం రాజుదే 
  4. హైడ్రా విషయంలో నాపై అనేక ఒత్తిళ్లు
  5. జన్వాడ ఫామ్‌హౌస్ లీజును కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు పెట్టలేదు?
  6. గత సర్కారు రికార్డులను మాయం చేసింది
  7. 111 జీవో ఇప్పటికీ సజీవంగానే ఉంది.. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్
  8. ప్రస్తుతానికి హైదారాబాద్‌లోనే హైడ్రా
  9. మీడియాతో చిట్ చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): చెరువుల సంరక్షణ విషయంలో హైడ్రా వెనక్కి తగ్గబోదని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో జలాశయాలను కాపాడటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. చెరువుల్లో ఎలాంటి నిర్మాణాలు ఉన్నా కూల్చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్, చెరువులు, నాళాల మీద, ప్రైవేటు స్థలాల్లో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని కట్టిన భవనాలను వదిలిపెట్టేలేది లేదని, నేలమట్టం చేసి తీరుతామని తేల్చి చెప్పారు.

పార్టీలను, వ్యక్తులను చూడబోమని, ఆ నిర్మాణం చెరువులో ఉందా? లేదా? అనేది మాత్రమే చూస్తామని సీఎం చెప్పారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.  తెలంగాణలో పాలన స్పీడ్ అందుకుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సరి దిద్దుతూ వస్తున్నామని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించుకు న్నామని, టీఎస్‌ను టీజీగా మార్చుకున్నామని, ఇప్పుడు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవబోతున్నామని చెప్పారు. హైడ్రా పేరుతో ప్రతిపక్షాలను ప్రభుత్వం వేధిస్తుందన్న విపక్షాల విమర్శలను సీఎం తోసిపుచ్చారు.

ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన కొందరు ప్రజాప్రతినిధులు అక్రమ నిర్మాణాలు చేపట్టారని, పార్టీలకు అతీతంగా తాము అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. మొట్టమొదట కూల్చింది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పల్లంరాజు భవనాన్నే అని వెల్లడించారు. కేసీఆర్ సీఎం అయిన తొలిసారి అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హడావుడి చేసి ఆ తర్వాత అటువైపు చూడలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందా? అన్న ప్రశ్నకు సీఎం స్పందిస్తూ.. తాను కేసీఆర్‌ను కాదని, రేవంత్ రెడ్డిని అని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుందని, వ్యక్తుల కోసం పని చేయదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని చెరువులు, నాళాల పరిరక్షణపై హైకోర్టు కూడా చాలా సీరియస్‌గా ఉందని తెలిపారు. ప్రతినెలా అక్రమ కట్టడాలపై తీసుకుంటున్న చర్యల నివేదికను అధికారులు హైకోర్టుకు సమర్పిస్తున్నారని చెప్పారు. ఏసీబీ తరహాలోనే హైడ్రాకు పోలీస్ స్టేషన్ హోదా ఇచ్చాని వెల్లడించారు. దీంతో హైడ్రాకు కేసులు నమోదుచేసే అధికారం కూడా ఉంటుందని తెలిపారు. తాను కొడంగల్, కోస్గి, కొండారెడ్డిపల్లికి మాత్రమే హెడ్‌ను కాదని, రాష్ట్రం మొత్తానికి సీఎంను అని, అందరినీ సమానంగా చూస్తానని అన్నారు.

జన్వాడ ఫామ్‌హౌస్‌కు సర్పంచ్ ఎలా అనుమతి ఇస్తారు?

కేటీఆర్ లీజుకు తీసుకున్న జన్వాడ ఫామ్‌హౌస్‌ను సర్పంచ్ అనుమతితోనే కట్టామం టూ దాని యజమాని హైకోర్టులో పిటిషన్ వేసిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఫామ్‌హౌస్ నిర్మాణానికి సర్పంచ్ ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. సర్పంచ్‌కు అలాంటి అనుమతులు ఇచ్చే అధికారం ఉండదని తెలిపారు. ఫామ్‌హౌస్‌ను లీజుకు తీసుకున్నా అని చెబుతున్న కేటీఆర్.. ఆ లీజు అంశాన్ని తన ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. దీనిపై మీడియా ఎందుకు రాయట్లేదని నిలదీశారు. గత పదేళ్లలో చెరువులు, నాలాలను కబ్జా చేసి కట్టినందుకు ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 

దగ్గరుండి నేనే కూల్చేయిస్తా..

చెరువుల్లో కట్టిన నిర్మాణాల్లో తన కుటుంబ సభ్యులవి కూడా ఉన్నాయన్న కేటీఆర్ విమర్శలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేటీఆర్ ఆధారాలతో వస్తే నా కుటుంబ సభ్యులవి దగ్గరుండి నేనే కూల్చేయిస్తా. కేటీఆర్ ఫామ్‌హౌస్ అక్రమ కట్టడం అని ఆధారాలతో నాడు పోరాటం చేశాను. ఇప్పుడు కేటీఆర్‌కు దమ్ముంటే నా కుటుంబ సభ్యులు లేదా నాకు చెందిన అక్రమ కట్టడాలు ఉంటే ఆధారాలతో రావాలి’ అని సవాల్ విసిరారు.

మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి అక్రమ నిర్మాణాల అంశాన్ని ప్రజా కోర్టులోనే తేల్చుకుందామని అన్నారు. వీరు ఎలాంటి ఆక్రమణలు చేయకపోతే సమస్యేలేదని, సచ్చీలురమని నిరూపించకునే సమయం వారికి వచ్చిందని తెలిపారు. హైడ్రా విషయంలో తనపై ఒత్తిళ్లు వస్తున్నాయని, అయినా వాటిని లేక్కచేయకుండా ముందుకెళ్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చెరువులు, నాళాల రికార్డులను గత సర్కారు మాయం చేసిందని ఆరోపించారు. 

చెరువుల్లో భూమి ఉండటం వేరు, నిర్మాణాలు కట్టడం వేరు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చెరువు శిఖ భూముల్లో పట్టాలు ఉంటాయని, వాటిని అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అని పేర్కొన్నారు. శిఖం భూముల ను కేవలం పంటల సాగుకు మాత్రమే ఉపయోగించాలని, వాటిల్లో ఎలాంటి నిర్మాణా లు చేపట్టాడనికి అధికారాలు లేవని స్పష్టం చేశారు. చెరువులు, కుంటల్లో సెక్రటేరియట్, జీహెచ్‌ఎంసీ లాంటి ప్రభుత్వ భవనాలను కట్టుకోవడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. రాయదుర్గం లో భవనాల కూల్చివేతను సీఎం సమర్థించుకున్నారు. అది ప్రభుత్వ భూమి అని తెలిపారు. 

కేటీఆర్, హరీష్‌రావుకు నా ముందుకొచ్చే ధైర్యం లేదు

ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ తెలిపారు. రుణమాఫీ సమస్యలపై ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో గ్రీవియన్స్ సెల్ పెట్టామ, రుణమాఫీ కాని రైతుల జాబితాను కేటీఆర్, హరీష్‌రావు కలెక్టర్లకు ఇస్తే తాము పరిశీలించి మాఫీ చేస్తామని చెప్పారు. కేటీఆర్, హరీష్‌రావుకు తన ముందుకు వచ్చే ధైర్యం లేదని, అందుకే కలెక్టరేట్లలో జాబితాను ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేశామని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ నేత గంప గోవర్ధన్‌కు రూ.1.61 లక్షల రుణమాఫీ అయ్యిందని చెప్పారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి 27 రోజుల్లోనే ఏకంగా 22,37,848 రైతుల ఖాతాల్లోని రూ.17,939 కోట్ల రుణా న్ని మాఫీ చేశామని తెలిపారు. బీఆర్‌ఎస్ గత ఐదేళల్లో కేవలం రూ.13,329 కోట్ల రుణమాఫీ చేసిందని విమర్శించారు. రూ.2 లక్షలపైన రుణం ఉన్నవారు మిగతా సొమ్మును చెల్లిస్తే.. అప్పు మాఫీ అవుతుందని తెలిపారు. రుణమాఫీపై హరీష్‌రావు అడ్డగోలుగా, బుర్రలేకుండా మాట్లాడాతున్నారని విమర్శించారు.

రుణమాఫీ చేస్తే హరీష్‌రావు రాజీమానా చేస్తానని సవాల్ విసిరి, ఆ తర్వాత తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. హరీష్‌రావు దొంగ అని తనకు ముందే తెలుసని విమర్శించారు. కేటీఆర్ కొడంగల్‌కు వెళ్తాను అంటే స్వాగతిస్తానని, ఆయన అక్కడి రైతులతో మాట్లాడాలని సూచించారు. కేటీఆర్‌ను వాళ్ల నాయన కేసీఆరే నమ్మరని, ప్రజలు ఎలా నమ్ముతారని ఎద్దేవా చేశారు. రుణమాఫీపై ధర్నాలు చేసే ది బీఆర్‌ఎస్ కార్యకర్తలే అని ఆరోపించారు. 

వాల్మీకి స్కామ్‌తో మాకు సంబంధం లేదు 

కర్ణాటక వాల్మీకి కుంభకోణంతో తమకు ఎలాంటి సంబంధం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ స్కామ్‌లో తెలంగాణ ఖాతా లు ఉన్నంత మాత్రాన తమకు సంబంధం ఉంటుందా? అని ప్రశ్నించారు. వాల్మీకి స్కా మ్‌తో బీఆర్‌ఎస్ నేతలకే లింకులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కోసం కొంతమంది బీఆర్‌ఎస్ నేతులు బెంగళూరు వెళ్లడం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న విభజన చిక్కుముడులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వీడుతు న్నాయని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలోని కార్పొరేషన్ రుణాల విషయం ఇటీవలే కొలి క్కి వచ్చిందని చెప్పారు. రుణాలు జనాభా దామాషా ప్రకారం పంచాలన్న తెలంగాణ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించిందని వెల్లడించారు. ఆ ప్రతిపాదనకు ఒప్పుకున్నం దుకే ఇటీవల కేంద్రం రూ.2,500 కోట్ల వడ్డీ లేని రుణాన్ని ఇచ్చిందని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన కూడా తమ హయంలోనే జరిగినట్లు చెప్పారు. పార్టీలో చేరేవారు తమ పాలన నచ్చి చేరుతున్నారని అన్నారు. తాము ఎవరినీ భయపెట్టి పార్టీలో చేర్చుకోవడం లేదని స్పష్టంచేశారు. తాము పాలిం చేందుకు కావలసినంత బలం ఉందన్నారు.

కేసీఆర్ ఉన్నారా?

ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మౌనంగా ఉండటంపై సీఎం రేవంత్ సెటైర్లు వేశారు. అసలు కేసీఆర్ ఉన్నారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చి, ప్రజ ల కోసం పోరాటం చేయాలని సూచించారు. కేసీఆర్‌కు ప్రతిపక్ష నేత హోదాలో జీతాలు ఇస్తున్నామని గుర్తుచేశారు. జీతం తీసుకుంటున్నందుకు ప్రజల్లో తిరగాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వ్యవస్థలను వాడుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు పనిచేయకపోతే ఎలా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, కాంగ్రె స్, బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలపై బహిరంగ చర్చలు జరుపుదామని సీఎం సవాల్ చేశారు. అన్ని పార్టీల మ్యానిఫెస్టోలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చిద్దామని సూచించారు. కేసీఆర్ పారిపోకుండా ఆ సమావేశాలకు రావాలని డిమాండ్ చేశారు. 

ప్రస్తుతానికి హైదరాబద్‌కే హైడ్రా పరిమితం

హైడ్రాను జిల్లాలకు కూడా విస్తారించాలని వస్తున్న డిమాండ్లపై సీఎం స్పందించారు. ప్రస్తుతం హైడ్రాను హైదరాబాద్‌కే పరిమితం చేస్తున్నట్లు చెప్పా రు. ఆ తర్వాత ఓఆర్‌ఆర్ అవతల ఉన్న ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు. 111జీవో పరిధిలోని కొన్ని గ్రామాలు కూడా హైడ్రా పరిధిలోకి వచ్చినట్లు చెప్పారు. అక్రమ కట్టడాలను అడ్డగోలు గా కూల్చేయబోమని, అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతే కూల్చేస్తా మని పేర్కొన్నారు.

30 ఏళ్ల కింద కట్టిన అక్రమ కట్టడాలపైనా హైడ్రా చర్యలు తీసుకుంటుందని స్పష్టంచేశారు. ఎంఐ ఎం నాయకుల అక్రమ కట్టడాలను కూల్చేయాలన్న బీజేపీ డిమాండ్‌పై సీఎం స్పందిస్తూ.. ఇప్పటికే ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబిస్ భవనాన్ని కూల్చేశామని తెలిపారు. విద్య ముసుగు లో అక్రమ కట్టడాలను కడితే చూస్తూ ఊరుకోమని సీఎం హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజులు మినహాయింపు ఉం టుందన్నారు. రాష్ర్టంలో సీబీఐకి కేసు ప్రయారిటీ బట్టి అనుమతి ఉంటుందని చెప్పారు.

కవిత బెయిల్‌కు బీజేపీ సాయం

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై సీఎం స్పందించారు. బీజేపీ మద్దతు వల్లే కవితకు ఇంత త్వరగా బెయిల్ వచ్చిందని విమర్శించారు. ఢిల్లీ డిఫ్యూటీ సీఎం మనీ ష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలల సమయం పట్టిందని, కేజ్రీవాల్‌కి ఇప్పటికీ రాలేదని గుర్తుచేశారు. అదే కేసు లో ఉన్న కవితకు మాత్రం 5 నెలల్లోనే బెయిల్ వచ్చిందన్నారు.

ఎంపీ ఎన్నికల్లో బీజే పీ కోసం బీఆర్‌ఎస్ పని చేసిందని, రాష్ట్రం లో బీజేపీ 8 సీట్లలో గెలవడానికి బీఆర్‌ఎస్ సహకరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితిలో లేదని, కానీ ఎంపీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో డిపాజిట్‌ను కోల్పోయిందని గుర్తుచేశారు. ఒకే కేసులో కొందరికి ఒక న్యాయం, కవితకు మరొక న్యాయమా? అని ప్రశ్నించారు.

111 జీవోపై బీఆర్‌ఎస్ డ్రామాలు 

111 జీవోను ఎత్తేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవ ని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గతంలో బీఆర్‌ఎస్ తీసుకొచ్చిన జీవో కూడా 111 జీవోను ఎత్తివేయడానికి ఎలాంటి మార్గా లు ఉన్నాయో అన్వేషించడం కోసమని తెలిపారు. 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 111 జీవో వచ్చిందని గుర్తుచేశారు.

సుప్రీంకోర్టు తీర్పు చెప్పే క్రమంలో కొన్ని పరిమితులను సూచించిందని, వాటిని నెరవేరిస్తే నే 111జీవోను సవరించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. కానీ వ్యాపారం కోసం గత ప్రభుత్వం 111జీవోను ఎత్తేస్తున్నట్లు డ్రామాలు ఆడిందని విమర్శించారు. ఇప్పుటికీ ఆ జీవో సజీవంగానే ఉందని స్పష్టం చేశారు. ఈ జీవో విషయంలో తాము సుప్రీంకోర్టు, ఎన్జీటీ మార్గదర్శకాలను పాటిస్తున్నామని తెలిపారు. 

చెరువుల కబ్జాలపై హరీష్‌ను ముందు పెడతాం

గతంలో ఇరిగేషన్ మంత్రిగా చేసిన హరీష్‌రావుకు చెరువులపై మంచి అవగాహన ఉందని, ఆయన హయాంలో కమిషన్ కాకతీయ వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. చెరువుల కబ్జాలపై నిజనిర్ధారణ కమిటీ వేద్దామని, దీనిపై హరీష్ రావును ముందు పెడదామని సూచించారు. దీంతో ఎవరి కబ్జా లు ఏంటో అప్పుడు తేలుతుందని అన్నారు.

జీవో 58, 59 పరిధిలో నిబంధనల ప్రకారం ముందుకు వెళతామని తెలిపా రు. ఈ జీవోల పరిధిలోని అక్రమ కట్టడాల లిస్టు తయారుచేసి నిషేధిత జాబి తాలో పెట్టామని చెప్పారు. మరికొన్ని రోజుల్లో కొన్ని భవనాలు కూల్చబోతున్నామని వెల్లడించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో చెరువుల లెక్కలు ఇంకా తేలాల్సి ఉందని చెప్పారు.

బీసీ కుల గణన చేస్తాం 

ఎన్నికల సంఘం నివేదిక ఆలస్యంగా రావటం వల్లనే పంచాయతీ ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని సీఎం తెలిపా రు. బీసీ కుల గణన చేసి తీరుతామని స్పష్టంచేశారు. ఈ నెల 31వ తేదీన బీసీ కమిషన్ పదవి ముగియబోతోందని, ఆ తర్వాత కొత్తవారు వస్తారని.. వారు వచ్చి న తర్వాత కుల గణన ఉంటుందని తెలిపారు. బీసీ కుల గణన పూర్తయ్యాకే ఎన్ని కలకు వెళ్తారా? లేక ముందుగానే వెళ్తా రా? అనేదానిపై సీఎం క్లారిటీ ఇవ్వలేదు.