31 March, 2026 | 2:36 AM

రేడియాలజిస్ట్ సేవల్లో నూతన రికార్డ్

31-03-2026 12:55 AM

అన్ని ఏజెన్సీ ఆసుపత్రుల్లో రేడియాలజిస్టులు టిఫ స్కాన్ సేవలు 

గిరిజన గర్భిణి మహిళలకు వరంగా మారనున్న స్కానింగ్ సేవలు

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 30 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ వైద్యరంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ఏజెన్సీ ఆసుపత్రుల్లో రేడియాలజిస్టులను నియమించి, టిఫ స్కాన్ వంటి అత్యాధునిక స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి భద్రాద్రి వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు నూతన రికార్డును నెలకొల్పాయి. దూర ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన మాతృశిశు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లా అధికారులు దశలవారీగా తీసుకున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి.

గతంలోనే అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ప్రసూతి వైద్యులను నియమించడం ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రసూతి సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఫలితంగా ప్రతి నెల డెలివరీలు, సిజేరియన్ శస్త్రచికిత్సలు, ట్యూబెక్టమీలు ఇతర మాతృసేవలు పెరిగాయి. ఈ క్రమంలో రేడియాలజీ సేవలను మరింత బలోపేతం చేస్తూ, భద్రాచలం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు ఆసుపత్రుల్లో ఇప్పటికే టిఫ్ఫా  స్కాన్ సేవలు అందుబాటులో ఉండగా, అశ్వారావుపేట ,చర్ల ప్రాంతాల్లో రేడియాలజిస్ట్ల కొరత ఒక ప్రధాన సవాలుగా నిలిచింది.

గత కలెక్టర్ జితేష్ పాటిల్ , డీసీహెచ్‌ఎస్ డా. రవి బాబు ప్రయత్నాలతో టిఫ్ఫా స్కానింగ్ యంత్రాలు సమకూర్చారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ అంకిత్ చొరవతో కొత్త రేడియాలజిస్ట్ను అశ్వారావుపేట, చర్ల ఆసుపత్రులకు నియమించి ఆ లోటును పూర్తిగా అధిగమించారు. సహజంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రేడియాలజిస్ట్లను నియమించడం అత్యంత క్లిష్టమైన పని అయినప్పటికీ, జిల్లా పరిపాలన పట్టుదల, సమన్వయంతో ఈ సవాల్ను విజయవంతంగా ఎదుర్కొని, జిల్లాలోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో రేడియాలజీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఇప్పటి వరకు అన్ని మాతృసేవలు అందుబాటులో ఉన్నప్పటికీ టిఫ్ఫా స్కాన్ లేకపోవడం ఒక లోటుగా ఉండేది, ప్రస్తుతంఈ సౌకర్యం అందుబాటులోకి రావడంతో గర్భిణీలు పూర్తి స్థాయి మాతృసేవలను తమ ప్రాంతాల్లోనే పొందగలుగుతున్నారు.   

గర్భంలోని శిశువు అవయవాల అభివృద్ధిని వివరంగా పరిశీలించి, పుట్టుకలో వచ్చే లోపాలను ముందుగానే గుర్తించేందుకు టిఫ్ఫా స్కాన్ ఎంతో ఉపయోగపడుతుంది. గర్భిణీకి సకాలంలో సరైన వైద్య నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడుతూ తల్లి-శిశువు భద్రతను మెరుగుపరుస్తుంది. గర్భిణి స్త్రీలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రయాణ సమయాన్ని,  ఖర్చులను తగ్గిస్తుంది. ప్రత్యేకంగా పేద, గిరిజన గర్భిణీలకు ఈ సేవలు ఎంతో మేలు చేస్తాయని, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని డి సి ఖి ఎస్ డాక్టర్ రవి బాబు తెలిపారు.