కొత్త ఆర్వోఆర్ చట్టం దేశానికే ఆదర్శం : మంత్రి పొంగులేటి
హైదరాబాద్: కొత్త ఆర్వోఆర్ చట్టం దేశానికే ఆదర్శంగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. రూ.2 లక్షలకు పైగా ఉన్న వారి ఖాతాల్లో నిధులు వేయలేదని, రూ.2 లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని చెల్లించాలని రైతులకు సూచించినట్లు మంత్రి తెలిపారు. పై మొత్తాన్ని రైతులు చెల్లించగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ వర్తింప చేస్తామని పొంగులేటీ వెల్లడించారు. బీఆర్ఎస్ నాయకులకు రైతుల పంటల రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం పదేళ్లలో రూ.11 వేల కోట్లు కూడా మాఫీ చేయలేదని, కేసీఆర్ ప్రభుత్వం రెండు సార్లు రైతులను మోసం చేసిందన్నారు. రూ.లక్ష మాఫీ విడతల వారీగా చేస్తామని ఐదేళ్లలో రుణమాఫీ చేయకుండా ఎన్నికల ముందు కొందరికే చేశారని పొంగలేటీ ద్వజమోత్తారు. కేసీఆర్ ప్రభుత్వం వలే మేం రైతులను మోసం చేయట్లేదని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని మంత్రి గుర్తు చేశారు.
ధరణి విషయంలో కేసీఆర్ ఎంత భయపెట్టినా ప్రజలు నమ్మలేదన్నారు. ధరణి విషయంలో పెండింగ్ లో ఉన్న లక్షల దరఖాస్తులను పరిశీలించామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తామని, 18 రాష్ట్రాల్లో రెవెన్యూ చట్టంపై అధ్యయనం చేయించామన్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రజల ముందుంచి అభిప్రాయాలు సేకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు






