10 July, 2026 | 10:04 AM

ఎనర్జీ సేవింగ్ మోడ్‌లో నిఖత్

09-05-2024 12:05 AM

ఒలింపిక్స్ కోసం తెలంగాణ బాక్సర్ ప్రత్యేక సాధన

పాటియాలలో ప్రాక్టీస్ చేస్తున్న జరీన్

సోషల్ మీడియాకు దూరం

రింగ్‌లో అడుగుపెట్టడమే తరువాయి.. వరుస పంచ్‌లతో రెచ్చిపోయే నైజం!

ప్రత్యర్థిని మెసలకుండా చేసి.. జాబ్స్, హుక్స్‌తో విరుచుకుపడే నైపుణ్యం!

పట్టు పడితే.. చివరి క్షణం వరకు ఓటమిని అంగీకరించని తత్వం!

వీటన్నింటి కలగలుపే తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్. నాలుగేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్ సమయంలో మేరీ కోమ్‌తో బౌట్ కోసం పట్టుబట్టి వార్తల్లోకెక్కిన ఇందూరు చిన్నది.. ఇప్పుడు తొలిసారి విశ్వక్రీడల బరిలో దిగనుంది. మరో మూడు నెలల్లో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన నిఖత్.. అందుకోసం ప్రత్యేక సాధన చేస్తోంది. సోషల్ మీడియాకు టాటా చెప్పడమే కాకుండా.. తనకిష్టమైన సంగీతాన్ని ఆస్వాదిస్తోంది. విశ్వక్రీడల కోసం శక్తిని దాచుకుంటున్నానం టున్న నిఖత్.. సన్నద్ధతలో భాగంగా మానసిక ప్రశాంతత కోసం వెబ్‌సిరీస్‌లు చూస్తోంది. వరుసగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి.. ఒలింపిక్ పతకంపై ఆశలు రేపుతున్న నిఖత్.. తన ప్రాక్టీస్ వివరాలు వెల్లడించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. 

న్యూఢిల్లీ: త్వరలో ఒలింపియన్‌గా మారబోతున్నా. విశ్వక్రీడలకు సమయం దగ్గర పడుతున్నకొద్ది ఒత్తిడి పెరిగిపోతుంది. కానీ మంచి ప్రదర్శన ఇచ్చేందుకు అత్యుత్తమ శిక్షణ తీసుకుంటున్నా. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నా. గంటల తరబడి ప్రాక్టీస్ అయితే చేయడం లేదు. అవసరమైన సమయంలో వినియోగించుకునేందుకు శక్తిని దాచుకుంటున్నా. దీన్ని నేను ‘ఎనర్జీ సేవింగ్ మోడ్’ అనుకుంటున్నా. ఒత్తిడిని దరిచేరనీయడం లేదు. అందుకే సోషల్ మీడియాకు పూర్తిగా దూరమయ్యా. ఇష్టమైన స్వీట్లు తింటున్నా. షాపింగ్ చేస్తున్నా, సంగీతం వింటున్నా.. ఇలా ఇష్టమైన పనులతో కాలక్షేపం చేస్తూనే మనసును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తున్నా. శిక్షణతో అలసిపోయిన సమయంలో సేద తీరేందుకు నెట్ ఫ్లిక్స్ షోలు చూస్తున్నా. నేను ఎన్నో ఏళ్లుగా ఒలింపియన్ అనిపించుకునేందుకు తహతహలాడా అనే విషయం తెలిసిందే. నాలుగేళ్ల క్రితమే ఆ అవకాశం రావాల్సింది కానీ.. తృటిలో తప్పిపోయింది. ఆ తర్వాత నన్ను నేను మరింత మెరుగు పరుచుకొని అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించా. దాని వల్లే వరుసగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలువగలిగా. అయితే విశ్వక్రీడలకు ఎంపికవడంతో పని అయిపోలేదు. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించడమే నా ప్రధాన లక్ష్యం. 50 కేజీల విబాగంలో పోటీ అధికంగా ఉండటం సహజమే కానీ.. మన చేతుల్లో ఉన్నదాని గురించే ఆలోచిస్తా. నా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలనుకుంటున్నా. పుష్కర కాలం క్రితం బాక్సింగ్‌లో దేశానికి దీదీ (మేరీకోమ్) ఒలింపిక్ మెడల్ అందించింది. ఆ తర్వాతే అమ్మాయిలు బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ముందుకు రావడం పెరిగింది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నా. ఎప్పటికప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నా.. ముందుంది మంచి కాలం అని పదే పదే చెప్పుకుంటున్నా. పారిస్ ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు ప్రస్తుతం పాటియాలలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా. అయితే ఇందులో కేవలం బాక్సింగ్ ప్రాక్టీస్ మాత్రమే కాకుండా.. మానసికంగా మరింత దృఢంగా మారేందుకు ప్రయత్నిస్తున్నా.

భారత్‌కు చివరి అవకాశం

వరల్డ్ క్వాలిఫయర్స్ టోర్నీ

ఇస్తాన్‌బుల్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు భారత రెజ్లర్లకు మరో అవకాశం లభించింది. గురువారం నుంచి ఇస్తాన్‌బుల్ వేదికగా వరల్డ్ క్వాలిఫయర్స్ టోర్నీ జరగనుంది. విశ్వక్రీడలకు అర్హ త సాధించేందుకు భారత రెజ్లర్లకు ఇదే చివరి అవకాశం. నాలుగు రోజుల పాటు జరగనున్న క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రీకో రోమన్, ఫ్రీ స్టుల్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ప్రతీ కేటగిరీలో ఇద్దరు ఫైనలిస్టులు ఒలింపిక్స్‌కు అర్హత సాధించనున్నారు. ఈ టోర్నీలో భారత్ నుంచి పురుషుల విభాగంలో అమన్ షెరావత్ (57 కేజీలు), దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కల్కల్ (65 కేజీలు) పోటీ పడనుండగా.. మహిళల విభాగం నుంచి మాన్సి అహ్లావత్ (62 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే మహిళల విభాగంలో వినేశ్ ఫొగాట్, అన్షు, రీతికా, అంతిమ్ పంగల్‌లు ఒలింపిక్సకు అర్హత సాధించారు.