ఫెడరేషన్ కప్ బరిలో నీరజ్
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నేషనల్ ఫెడరేషన్ కప్‌లో బరిలోకి దిగనున్నాడు. మే 12 నుంచి 15 మధ్య భువనేశ్వర్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. కాగా నీరజ్ చోప్రా మూడేళ్ల తర్వాత ఫెడరేషన్ కప్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దోహాలో ఉన్న నీరజ్ చోప్రా మే 10న డైమండ్ లీగ్ సిరీస్ ముగిశాకా భారత్‌కు చేరుకునే అవకాశముంది. నీరజ్‌తో పాటు కిషోర్ కుమార్ జెనా కూడా ఫెడరేషన్ కప్‌లో పాల్గొంటాడని అథ్లెటిక్స్ ఫెడరేషన్ తెలిపింది. 2022 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో మెరిసిన నీరజ్ చోప్రా ఆ తర్వాత అదే ఏడాది డైమండ్ లీగ్ చాంపియన్‌గా నిలిచాడు. 2023లో వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన నీరజ్ హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్‌తో మెరిశాడు. 2022 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో రజతం సొంతం చేసుకున్నాడు. రానున్న పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను 90 మీటర్ల దూరం విసరడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కాగా జావెలిన్ త్రోలో 89.94 మీటర్ల దూరం ఇప్పటివరకు నీరజ్ కెరీర్ బెస్ట్‌గా ఉంది.






