4 రోజుల్లో రూ.9 లక్షల కోట్లు
వరుస పతనంతో ఇన్వెస్టర్లు కోల్పోయిన సంపద
l సెన్సెక్స్ మరో 455 పాయింట్లు డౌన్
l 22,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ
ముంబై, ఏప్రిల్ 18: ఒక వైపు మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు, మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలపై అంచనాలు ఆవిరైపోవడంతో ఇన్వెస్టర్లు స్వల్పకాలంలో భారీ సంపదను కోల్పోయారు. ఏప్రిల్ 12 నుంచి కేవలం నాలుగు ట్రేడింగ్ రోజుల్లో బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.402.2 లక్షల కోట్ల నుంచి రూ.393.2 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో రూ.9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. గురువారం వరుసగా నాలుగో రోజూ స్టాక్స్ పతనం కొనసాగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ మరో 455 పాయింట్ల మేర క్షీణించి 72,489 పాయింట్ల వద్ద నిలిచింది. నాలుగు రోజుల్లో 2,500 పాయింట్లకు పైగా సూచీ పతనమయ్యింది. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తాజాగా మరో 152 పాయింట్ల నష్టంతో కీలకమైన 22,000 పాయింట్ల దిగువన 21,996 పాయింట్ల వద్ద నిలిచింది. నాలుగు రోజుల్లో ఈ సూచి 750 పాయింట్లకుపైగా పడిపోయింది. యుద్ధ భయాలకు ప్రపంచ మార్కెట్లన్నీ కునారిల్లిన సమయంలోనే బుల్స్‌ను నిరుత్సాహపర్చే రెండు వార్తలు అమెరికా నుంచి వెలువడ్డాయి. మార్చి నెలలో ద్రవ్యోల్బణం అంచనాల్ని మించి 3.5 శాతం పెరగడం, రిటైల్ అమ్మకాలు 0.7 శాతం వృద్ధిచెందడంతో యూఎస్ ఫెడ్ ఈ జూన్ నెలలో వడ్డీ రేట్లు తగ్గించదంటూ మార్కెట్లు డీలా పడ్డాయి. జూన్‌తో మొదలుపెట్టి ఈ ఏడాది కనీసం మూడు దఫాలు వడ్డీ రేట్ల కోతలుంటాయన్న అంచనాలు ఇప్పటివరకూ ఉండ గా, అమెరికాలో వెలువడిన తాజా గణాంకాలు ఆ అంచనాల్ని నీరుకార్చాయని మార్కెట్ నిపుణలు వివరించారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతల్ని జాప్యం చేస్తుందన్న అంచనాలతో విదేశీ ఫండ్స్ విక్రయాలు జరుపుతున్నట్టు ట్రేడర్లు చెప్పారు.
రేట్ల తగ్గింపు ఆశలు ఆవిరి
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు తోడు యూఎస్ రేట్ల తగ్గింపు ఆశలు ఆవిరైపోవడంతో స్టాక్ సూచీల పతనం కొనసాగుతున్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ వంటి హెవీవెయిట్ రంగాలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయన్నారు. యూఎస్‌లో అంచనాల్ని మించి యూఎస్ ద్రవ్యోల్బణం పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని వినోద్ నాయర్ వివరించారు. ఫిబ్రవరికంటే మార్చిలో యూఎస్ ఇన్‌ఫ్లేషన్ మరింత పెరగడంతో ట్రెజరీ ఈల్డ్స్ ఎగిసాయని, దీంతో ఈ ఏడాది మూడు రేట్ల కోతలు ఉంటాయన్న ఇన్వెస్టర్ల ఆశలు అడుగంటాయని క్రూడాయిల్ ధరలు పెరగడం కూడా దేశీయ మార్కెట్లో అమ్మకాల కు పురికొల్పిందని వివరించారు. అధిక విలువలు, క్యూ4 లాభాల వృద్ధిపై అంచనాలు తగ్గడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాలు భారీగా జరిగాయన్నారు.
సాంకేతిక మద్దతు 21,900
నిఫ్టీ కీలకమైన 21ఈఎంఏ దిగువన క్రమేపీ బలహీనపడిందని, అయితే హవర్లీ చార్టుల్లో బుల్లిష్ హరామీ ప్యాట్రన్ ఏర్పడటం సమీప భవిష్యత్తులో బుల్లిష్ రివర్స ల్‌ను సూచిస్తున్నదని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే తెలిపారు. ఈ కారణంగా వచ్చే ఒకటి, రెండు సెషన్లలో 22,200 దిశగా కదిలే అవకాశం ఉందని, 21,900 స్థాయి మద్దతు అందించవచ్చని వివరించారు.
నెస్లే టాప్ లూజర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా నెస్లే 3 శాతం పడిపోయింది. బోర్నవిటాలో చక్కెర స్థాయిపై నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ షేరును ఇన్వెస్టర్లు విక్రయించారు. టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐటీసీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ లు 1 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు భారతి ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, లార్సన్ అండ్ టూబ్రో లు లాభపడ్డాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 1.52 శాతం తగ్గగా, ఆయిల్ అండ్ గ్యాస్ సూచి 0.96 శాతం, ఆటో ఇండెక్స్ 0.73 శాతం, రియల్టీ ఇండెక్స్ 0.70 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ 0.54 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 0.39 శాతం చొప్పున తగ్గాయి. టెలికమ్యూనికేషన్, టెక్నాలజీ సూచీలు పెరిగాయి.
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల వెల్లువ
n రూ. 20 వేల కోట్లు వెనక్కి
ఏప్రిల్ తొలివారంలో వరుసగా పెట్టుబడులు చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) హఠాత్తుగా మార్కెట్ నుంచి నిధు లు వెనక్కు తీసుకుంటున్నారు. వరుసగా నాలుగు ట్రేడింగ్ రోజుల్లో దా దాపు రూ. 20,000 కోట్ల అమ్మకాలు జరిపారు. శుక్రవారం రూ. 8,000 కోట్లకుపైగా నికర విక్రయా లు జరిపిన ఎఫ్‌పీఐలు సోమవారం మరో రూ. 3,268 కోట్లు, మంగళవారం రూ.4,468 కోట్లు వెనక్కు తీసుకోగా, గురువారం రూ.4,260 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు స్టాక్ ఎక్సేంజీల తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గ వన్న సంకేతాలతో భారత్‌తో సహా వర్ధమాన దేశాల్లో ఎఫ్‌పీఐలు నిధుల్ని వెనక్కి తీసుకుంటున్నారు.






