రాష్ట్ర స్థాయి పోటీలో నిర్మల్ డిగ్రీ కళాశాల ప్రతిభ

11-09-2026 | 02:46pm

నిర్మల్ సెప్టెంబర్ 11 ( విజయ క్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల(Government degree colleges) విద్యార్థుల కోసం నిర్వహించిన 'జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్' రాష్ట్ర స్థాయి పోటీల్లో నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గణిత శాస్త్ర విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నట్టు ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. 

కళాశాల గణిత శాస్త్ర అధ్యాపకులు కట్టా రమేష్ రెడ్డి పర్యవేక్షణలో విద్యార్థులు ఎం. రాణి, ఎం. అక్షయ, ఎస్. అమూల్య, టి. రిషిక, ఎం. సిందుజల బృందం "హై స్కూల్ విద్యార్థుల్లో గణితం పట్ల ఆందోళన" అనే అంశంపై సమగ్ర పరిశోధన చేసి ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న గణిత భయానికి గల కారణాలు, వాటి పరిష్కార మార్గాలపై వారు చేసిన అధ్యయనాన్ని రాష్ట్ర స్థాయి పోటీలలో సమర్థవంతంగా ప్రదర్శించి ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించారు.

రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటి కళాశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థులను మరియు ప్రాజెక్ట్ గైడ్ కట్టా రమేష్ రెడ్డిని కళాశాల డాక్టర్ యు. గంగాధర్, కళాశాల అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు