నితిన్ నబీన్ పర్యటన విజయవంతం చేయాలి
- హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
- రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్రం కృషి
- బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్
హనుమకొండ, జూన్ 27(విజయ క్రాంతి): ఈ నెల 29న జరగనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ పిలుపునిచ్చారు. హనుమకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ, హనుమకొండ, వరంగల్ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి, గంట రవికుమార్ లతో కలిసి పాల్గొని లక్ష్మణ్ మాట్లాడారు.ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు చేయగలిగిన హామీలనే ఇస్తారని, వాటిని అమలు చేస్తారని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, పెన్షన్ల పెంపు వంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు.
హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, నితిన్ నబీ వరంగల్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతో పాటు తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఓరుగల్లులో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మార్తనేని ధర్మారావు, కొండేటి శ్రీధర్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, వన్నాల వెంకటరమణ, జలగం రంజిత్ కుమార్, కుసుమ సతీష్, రాణా ప్రతాప్, సండ్ర మధు, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






