అదానీకి అమెరికా కోర్టు షాక్
- లంచాల కేసులో ఆదానీతో పాటు ఇతర నిందితులపై
- అభియోగాల తక్షణ కొట్టివేతకు ఫెడరల్ జడ్జి నిరాకరణ
- ఈ కేసు ఎందుకు విత్ డ్రా చేసుకుంటున్నారో చెప్పాలని న్యాయస్థానం నిలదీత
- అమెరికా న్యాయశాఖను ఆదేశించిన న్యాయమూర్తి
వాషింగ్టన్, జూన్ 27: బిలియనీర్ గౌతమ్ అదానీకి అమెరికా కోర్టు షాకిచ్చింది. లంచం కేసులో అదానీతోపాటు ఇతర నిందితులపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను తక్షణమే కొట్టివేసేందుకు అమెరికా ఫెడరల్ జడ్జి నిరాకరించారు. ఈ కేసును ఎందుకు విత్‌డ్రా చేసుకోవాలని న్యాయశాఖ భావిస్తున్నదో చెప్పాలని శుక్రవారం ఆదేశించారు. ఈ మేరకు బ్రూక్లిన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గరాఫిస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 18న జస్టిస్ డిపార్ట్‌మెంట్ దాఖలు చేసిన పిటిషన్ చాలా క్లుప్తంగా, బలమైన కారణాలు లేకుండా ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ కేసును ఎందుకు డ్రాప్ చేయాలనుకుం టున్నారో సరైన ఆధారాలతో కూడిన నివేదికను జూలై 13 లోగా కోర్టుకు సమర్పించాలని ప్రాసిక్యూటర్లనూ ఆదేశించారు. అప్పటి వరకు కేసును అధికారికంగా కొట్టివేయడానికి నిరాకరించారు. బుధవారం కోర్టు రికార్డులలో ప్రచురించిన ఒక లిఖితపూర్వక తీర్పులో, ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కేసును విరమించుకుంటున్నట్లు ఇచ్చిన నోటీసు వారి నిర్ణయాన్ని తగినంతగా వివరించలేదని, మరింత సమాచారాన్ని సమర్పించడానికి వారికి జూలై 13 గడువు ఇచ్చామని జడ్జి పేర్కొన్నారు.
ప్రభుత్వం తన సంక్షిప్త, నిస్సారమైన, నిర్ధారణాత్మక ప్రకటన, ఏ నిర్ధారణకూ రావడానికి న్యాయస్థానానికి తగిన ఆధారాన్ని ఇవ్వడం లేదని తెలిపారు. అలాగే కొట్టివేత కోసం ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై ఎలాంటి విశ్లేషణ చేసే అవకాశాన్ని కూడా కల్పించడం లేదని జడ్జి స్పష్టం చేశారు. ఆదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై 2024లో అమెరికాలో నమోదైన కేసులో, ఇండియాలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఆమోదానికి వందల మిలియన్ డాలర్ల లంచాలు ఇవ్వడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే, ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ మొదటి నుంచీ ఖండిస్తూ వస్తోంది. అయితే అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయశాఖ వైఖరి మారింది. ఈ కేసుపై మరింత సమయం, నిధులను కేటాయించలేమని న్యాయ శాఖ పేర్కొంది. కానీ జడ్జి ఆమోదం లేకుండా అభియోగాలను ఉపసంహరించుకోవడం సాధ్యం కాదు. కావున జూన్ 24న, అదానీ తరఫు న్యాయవాదులు ఈ కేసు అమెరికా అధికార పరిధిలోకి రాదని, లంచం ఇచ్చినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. అయితే, న్యాయమూర్తి తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వానికి పూర్తి వివరణ కావాలని స్పష్టంగా చెప్పారు.
ఈ క్రిమినల్ కేసు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో, అదానీ గ్రూప్ సివిల్ వివాదాల పరిష్కారానికి అంగీకరించింది. ఇందులో భాగంగా, గౌతమ్ అదానీ 6 మిలియన్ డాలర్లు, సాగర్ అదానీ 12 మిలియన్ డాలర్ల మేర సివిల్ సెటిల్మెంట్ కింద చెల్లించడానికి ప్రతిపాదనలు చేసుకున్నారు. అదే విధంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఇరాన్ నుంచి ధ్రువీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) దిగుమతులకు సంబంధించి అమెరికా ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణల పరిష్కారానికి 275 మిలియన్ డాలర్లు చెల్లించడానికీ అంగీకరించింది.






