అప్పు ఇవ్వకుంటే రుణమాఫీ చేయరా?
సన్నవడ్లకే బోనస్ అని ముందు ఎందుకు చెప్పలేదు?
భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని, ఒకవేళ బ్యాంకులు అప్పు ఇవ్వకుంటే రుణమాఫీ చేయ రా? అని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ప్రశ్నించారు. రైతులను మోసం చేసిన ఏ నాయకుడు బాగుపడరనే గుర్తుంచుకోవాలన్నారు. రుణమాఫీ చేయా లంటే దాదాపు రూ.40 వేల కోట్లు అప్పు తీసుకురావాలని, ఈ విషయంలో రైతులను మళ్లీ మోసం చేసేందుకు కాంగ్రెస్ సాకులు వెతుకుతోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో గురువారం మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.
రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ, వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్, భరోసా కింద ఏటా రూ.15,000, రైతు కూలీలకు రూ.12,000 ఇలా అనేక హామీ లను ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయ డం లేదన్నారు. ఫసల్ బీమా యోజన ద్వారా నష్టపోయిన ప్రతి ఎకరాకు నష్టపరిహారం రూ.25 వేలు అందిస్తామని చెప్పి ఆదుకోకుండా మోసం చేశారన్నారు. పది రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యానికి కాంటా వేసే దిక్కులేదన్నారు. ఎన్నికలు ముగిశాక ఇప్పుడు కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని ప్రకటించి దొడ్డు వడ్లు పండించే రైతులకు మొండిచెయ్యి చూపిందన్నారు. రాష్ట్రంలో వానకాలమైనా, యాసంగి అయినా దొడ్డు వడ్లే ఎక్కువ సాగవుతాయని తెలిపారు.




