26 March, 2026 | 5:38 PM

సెగ్రిగేషన్ షెడ్లు.. అలంకారప్రాయం

17-05-2024 12:55 AM

సేకరిస్తున్న తడి, పొడి చెత్త వృథా

పంచాయతీల్లో తయారు కాని సేంద్రియ ఎరువు

ఆదాయం కోల్పోతున్న గ్రామ పంచాయతీలు

అధికారులు దృష్టి సారించాలని కోరుతున్న ప్రజలు 

వనపర్తి , మే 16 (విజయక్రాంతి): గ్రామాలను పరిశుభ్రంగా మార్చడంతో పాటు చెత్త నుంచి సంపద సృష్టించడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలను చేపట్టింది. గ్రామాల్లో ఎక్కడా చెత్త కనిపించకుండా ఎప్పటికప్పుడు డంపింగ్‌యార్డులకు చేర్చి తడి, పొడి చెత్తను వేరు చేసి కంపోస్టు ఎరువులను తయారు చేసేందుకు నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు ప్రస్తుతం వినియోగంలో లేక అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. సెగ్రిగేషన్ షెడ్ల నిర్మా ణం ఉద్దేశం మంచిదైనప్పటికీ ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చక పోవడ ంతో లక్ష్యం నెరవేరకుండా పోతోంది. తడి, పొడి చెత్తను వేరే చేసేందుకు గాను ప్రతి గ్రామ పంచాయతీలో, పట్టణ పరిధిలో ప్రతి ఇంటి కి చెత్త బుట్టలను సైతం పంపిణీ చేశారు. ట్రాక్టర్ల ద్వారా గ్రామాల్లోని చెత్తను సేకరించి సేంద్రియ ఎరువును తయారు చేసి గ్రామాలకు ఆదాయ వనరులు సమకూర్చే దిశగా గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పూర్తిస్థాయిలో అమలు జరగడం లేదు. సేంద్రియ ఎరువును హరితహారం మొక్కలకు వేయడంతో పాటు రైతులకు విక్రయించి గ్రామ పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి ఉంది. కానీ గ్రామాల్లో సేంద్రియ ఎరువులను తయారు చేయకపోవడంతో గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులు తగ్గడం ఒకవైపు అయితే.. మరొక వైపు అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభు త్వ లక్ష్యం నీరుగారుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. 

నిరుపయోగంగా..  

గత ప్రభుత్వం ఒక్కో షెడ్డుకు లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేపట్టినప్పటికీ నిర్వహణ లేక అస్తవ్యస్తంగా మారా యి. వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బహిరంగగానే వినిపిస్తున్నాయి. అధికారులు సెగ్రిగేషన్ షెడ్లను వినియోగంలోకి తీసుకొచ్చి సేంద్రియ ఎరువును తయారు చేసి పంచాయతీకి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ షెడ్లలో ఏర్పాటు చేసిన కుండీల్లో వేయకుండా బయట డంపు చేస్తూ చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సేంద్రియ ఎరువును తయారు చేసేలా చర్యలను చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.