18 May, 2026 | 2:11 AM

ఏ జానర్ సినిమా చేసినా వినోదం పంచడమే నా లక్ష్యం

18-05-2026 01:03 AM

పవన్‌కళ్యాణ్ బత్తుల హీరోగా కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుషః’. వీరు వులవల దర్శకత్వం వహించారు. సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. మే 22న రిలీజ్ కానున్న ఈ సినిమా విశేషాలను కథానాయకుడు పవన్‌కళ్యాణ్ మీడియాతో పంచుకున్నారు. “నేను ‘తమ్ముడు’ టైమ్‌లో పుట్టా. అందుకే మా నాన్న నాకు పవన్‌కళ్యాణ్ అని పేరు పెట్టారు.

నాకు సినిమాలంటే చాలా ఇష్టం. మా నాన్నకు కూడా నన్ను హీరో చేయాలనే ఆశ ఉండటంతో ఇటు వైపు వచ్చేశా. ఈ సినిమాలోని ప్రతీ విషయంలో మా సిస్టర్ సరస్వతి నాకు తోడుగా నిలిచారు. డీవోపీ సతీశ్ వల్లే ఈ ప్రాజెక్ట్ మా దగ్గరకు వచ్చింది. ఈ చిత్రంలో అన్ని పాత్రలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. ఓ మంచి చిత్రాన్ని చూశామన్న ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ చిత్రంలాగా మా సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రతీ సీన్‌ను ఎంతో జాగ్రత్తగా చేశాం. ఈ ప్రయాణంలో సినిమా ఆర్టిస్టుల కష్టాలన్నీ నాకు తెలిశాయి. ఏ జానర్‌లో సినిమా చేసినా ప్రేక్షకులకు వినోదం పంచాలన్నదే నా లక్ష్యం” అని చెప్పారు.