విష ప్రచారాలు వద్దు!
సమర్థవంతమైన ప్రభుత్వ పాలనకు మెరిట్, అంకితభావం, ప్రజా సేవకునిగా పని చేసే అనుభవజ్ఞులైన అధికార యంత్రాంగం చాలా అవసరం. కానీ, ఈ మధ్య కాలంలో మెరిట్ కంటే పాలకులకు అనుయాయులుగా చెప్పింది ఏదైనా ‘ఎస్ బాస్’ అనే బానిస యంత్రాంగాన్ని పాలకులు కోరుకుంటున్నారు. తద్వారా పాలనలో అసమర్థత, అవినీతి, ప్రజలకు దూరంగా ఉండే యంత్రాంగాన్ని చూశాం. కానీ, ఇప్పుడున్న ప్రజాపాలన ధ్యేయంగా కొనసాగుతున్న ప్రభుత్వం సమర్థతకు, నిత్యం ప్రజలతో మమేకమై వారికి సేవకులుగా ఉండే అధికారులను ముఖ్యమైన శాఖలలో నియమిస్తూ పీపుల్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటున్నది.
బుర్రా వెంకటేశం 1995వ బ్యాచ్‌కు చెందిన డైరెక్ట్‌గా ఎంపిక అయిన ఐఏఎస్ అధికారి. ఈయన చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా తల్లి అండదండలతో తన విద్యాభ్యాసాన్ని హాస్టళ్లలో ఉంటూ పూర్తి చేసుకుని ఐఏఎస్ అధికారిగా ఒక మారుమూల గ్రామం నుంచి ఎంపికయ్యారు. దేశంలోనే 15వ ర్యాంకు సాధించి ఎంతోమంది యువతీ యువకులకు అప్పుడూ ఇప్పుడూ ఆదర్శంగా నిలుస్తూ 29 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. మొదట ఆదిలాబాద్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా, రంపచోడవరం ఐటీడీఏలో పీవోగా, వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా, చిత్తూరు, గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా, మెదక్, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా పని చేసి విలక్షణమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
మెదక్ జిల్లా కలెక్టర్‌గా పని చేసినపుడు ఇప్పుడున్న ఐఐటీ నెలకొల్పడానికి భూ సేకరణలోనూ, అప్పటి ప్రధానమంత్రి చేతుల మీదుగా పేద ప్రజలకు సుమారు 25,000 ఎకరాల భూ పంపిణీ, ఇప్పుడున్న అన్ని కలెక్టరేట్లకు మోడల్‌గా తన హయాంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ సంగారెడ్డిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సహకారంతో నిర్మించారు. అలాగే, మెదక్ జిల్లాలోని అనేక సంక్షేమ కార్యక్రమాల అమలులో మొదటి స్థానంలో కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఎండీగా, ఇన్ఫర్మేషన్, పబ్లిక్ రిలేషన్ కమిషనర్‌గా, టూరిజం కార్పొరేషన్ ఎండీగా, హౌసింగ్ శాఖ కార్యదర్శిగా, హోంశాఖ కార్యదర్శిగా, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కమిషనర్‌గా, ముఖ్య కార్యదర్శిగా రాష్ట్రస్థాయిలో సేవలందించారు.
ఇటువంటి అనుభవజ్ఞుడైన, సమర్థుడైన అధికారిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. విద్యాశాఖలోనే అంతర్భాగమైన కాలేజియేట్ కమిషనర్‌గా, జేఎన్టీయూ విశ్వవిద్యాలయానికి ఇంచార్జ్ విసిగా, సాంకేతిక శాఖ విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఇదివరకే ముఖ్యకార్యదర్శిగా ఉన్న బీసీ శాఖకు అదనపు బాధ్యతలు సైతం నిర్వహిస్తున్నారు. ఇవి కాక గవర్నర్‌కు ముఖ్య కార్యదర్శిగా మరో అదనపు బాధ్యతగా ఏరికోరి నియమించారు. కానీ, ఇన్ని బాధ్యతలు బుర్రా వెంకటేశంకు భారంగా ఉన్నాయని అన్నింటికీ సమయాన్ని కేటాయించకలేక పోతున్నారని ఈ మధ్య కొన్ని పత్రికలు తప్పడు కథనాలు ప్రచురించాయి.
ఈ విషయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎందరో ఉద్యమకారులకు పరోక్షంగా సహాయ సహకారాలు అందించి తెలంగాణ ఏర్పాటులో తన వంతు పాత్రను పోషించిన ఇటువంటి అధికారికి గత ప్రభుత్వం ఎటువంటి బడ్జెట్ కేటాయించకుండా సుమారు ఆరేండ్లు ఒకే శాఖలో ఉంచి వారి సేవలను ప్రజలు వినియోగించుకోకుండా చేసింది. అదే వేరే రాష్ట్రాలనుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులకు ప్రాముఖ్యత ఉన్న ఐదారు శాఖలను కేటాయించి తెలంగాణకు చెందిన ఇటువంటి సమర్థవంతమైన అధికారులను పక్కన పెట్టారు. ఇప్పుడు విమర్శలు చేసిన వారికి అప్పుడు అవేమీ కనిపించలేదా? చివరకు పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా ముఖ్యమైన శాఖలను కేటాయించి సర్వీసులో ఉన్న అధికారులను అప్పటి ప్రభుత్వం పక్కన పెట్టింది.
ఇది అన్యాయమని వారికి అనిపించలేదు. ఇంకా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు అన్నిటికీ వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు నికార్సయిన తెలంగాణ అధికారైన బుర్రా వెంకటేశాన్ని ఏ ఒక్క యూనివర్సిటీ వీసీ పదవికి ఇంచార్జిగా నియమించలేదు. తెలుగుభాషే సరిగా రాని ఇతర రాష్ట్రాల అధికారులను ఆ స్థానాలలో కూర్చోబెట్టారు. ఇది ఎంత వరకు సబబో అప్పటి ఏలిన పాలకులకు, వారికి వంతపాడిన విదూషకులకే తెలియాలి.
ఆరేండ్లు బీసీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసినప్పుడు పేపర్లమీద తప్ప ఒక్క పైసాకూడా విదల్చకుండా బీసీ శాఖను నిర్వీర్యం చేసినా, బీసీ నేతలు తరచూ ఈ శాఖ కార్యాలయాన్ని సందర్శించి ఎన్ని విమర్శలు చేసినా వారందరినీ సమన్వయ పరచి ఏ రోజూ నాయకుల్ని రోడ్డెక్కనీయలేదు. ఎప్పుడూ బీసీ సంక్షేమ భవన్ ముందు ధర్నాలు, కుర్చీలు విరగ్గొట్టడాలు, హాస్టళ్లలో వార్డెన్ల నిర్బంధాలు జరిగేవి. కానీ, ఈ అధికారి బీసీ నాయకులను సముదాయించి ఏ రోజూ గొడవలు చేయకుండా వారందరినీ శాంతింపజేసేవారు. ప్రభుత్వాన్ని రోడ్డుమీద నిలబెట్టకుండా బాధ్యతగల అధికారిగా వారు చేసినఈ ప్రయత్నాన్ని గత ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదు. అంతేకాకుండా, అదే శాఖలో ఉంచి అవమానానికి గురి చేసిన మాట వాస్తవం కాదా!?
సమర్థవంతమైన అధికారేకాక ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ అనే వ్యక్తిత్వ వికాస పుస్తకం ద్వారా తన ఆలోచనలని, భావాలను ప్రపంచానికి తెలియజెప్పారు. ప్రతీ మనిషి విజయానికి కావలసిన పట్టుదల, నిజాయితీ, కీర్తి కాంక్ష లేకపోవడం లాంటి గొప్ప విషయాలని పుస్తకంలో పొందుపరచడం వల్ల అమెజాన్‌లోనే అత్యధిక కాపీలు అమ్ముడు పోయిన పుస్తకంగా అది ప్రసిద్ధిగాంచింది. ఇవేకాక అమ్మమీద శతకాలు, ఇంకా ఇతర రచనలు ప్రోత్సహిస్తూ ఎంతోమంది సాహితీవేత్తలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
నూతన ప్రభుత్వం ఆయన సమర్థతను, నిజాయితీని, అంకితభావాన్ని గుర్తించి విద్యాశాఖ, అందులో అంతర్భాగమైన ఖాళీ పోస్టులను కేటాయిస్తూ సమర్థవంతంగా నిర్వహించిన బీసీ శాఖను అదనపు బాధ్యతగా ఇవ్వడంతో కొంతమంది ఓర్వలేక దుష్ప్రచారం మొదలెట్టారు. ఎంతో గౌరవప్రదమైన పోస్ట్ అయిన రాజ్‌భవన్ ముఖ్య కార్యదర్శి పదవికూడా ఇవ్వడంతో వీళ్ల కుళ్లు నషాళానికి ఎక్కి పిచ్చి రాతలు రాయిస్తున్నారు. ఏవో కుంభకోణాలు, అవినీతి జరుగుతోందని దుష్ప్రచారం మొదలుపెట్టారు. గత ప్రభుత్వం విస్మరించిన అధికారికి సమర్థతను గుర్తించి తగిన గౌరవంతోనే విద్యాశాఖను అప్పగించారు.
అప్పటి నుంచి సెక్రటేరియట్‌లో అత్యధికంగా సందర్శకులకు సమయమిచ్చి వారి సమస్యలను ఆలకించి పరిష్కారం దిశగా ప్రయత్నించే ఒకే ఒక్క అధికారి బుర్రా వెంకటేశం. ఏ రోజూ ఫైళ్లను చూడకుండా పెండింగ్ పెట్టని అధికారి బుర్రా వెంకటేశం. రాష్ట్రానికి మరిన్ని మంచి శాఖలను నిర్వహించి సేవలు అందించబోయే అసలు సిసలైన సమర్థుడైన అధికారిని ఇటువంటి పిచ్చిరాతలతో, కుతంత్రాలతో వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ఎటువంటి ప్రయత్నాలను తెలంగాణ పౌర సమాజం సమర్థించబోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ప్రజాపాలనను తీసుకు రావాలనుకున్న నూతన ప్రభుత్వానికి మనం సమర్థవంతమైన అధికారులను ప్రోత్సహించి, గౌరవించి సంఫీుభావం తెలియజేద్దాం. అంతేకాక మాజీ రాష్ట్రపతి, నిజాయితీకి నిలువుటద్దమైన అబ్దుల్ కలాం ప్రశంసలు పొందిన ఏకైక అధికారిపై కుళ్లు, కుతంత్రాలతో విష ప్రచారం చేసేవాళ్ల ప్రయత్నాలను తీవ్రంగా ఖండిద్దాం, తిప్పిగొడదాం. వారి ఆటలు మితిమీరితే న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధమని హెచ్చరిస్తున్నాం.
వ్యాసకర్త జూనియర్ అడ్వకేట్ జేఏసీ చైర్మన్
సెల్: 9542871999






