05-02-2026 12:00:00 AM
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్ల, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. నామినేషన్ల ఉపసంహరణ ముగిసి, అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచార బరిలోకి దిగాయి.బుధవారం చేవెళ్ల మున్సిపాలిటీలోని 1, 2 వార్డుల్లో (ఊరెళ్ల గ్రామం) బీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ప్రజల గుండెల్లో కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్న ముఖ్యమంత్రి, ఒకసారి గ్రామాల్లోకి వెళ్లి చూడాలని ఆమె సవాల్ విసిరారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలే కెసిఆర్ చెరపలేని నిషాన్ అని పేర్కొన్నారు. ఊరెళ్ల గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడం వల్ల ప్రజలపై అనవసరమైన పన్నుల భారం పడిందని, కొందరి స్వార్థం కోసమే స్థానిక ఎమ్మెల్యే, సర్పంచ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె ఆరోపించారు.
ప్రజలపై భారం మోపిన నేతలకు బుద్ధి చెప్పాలని, ఎల్లవేళలా ప్రజల పక్షాన నిలిచే బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పెద్దల ప్రభాకర్, మాజీ కనీస వేతనాల చైర్మన్ నారాయణ, ఆంజనేయులు, పట్ల హనుమంత్ రెడ్డి, గోనె కరుణాకర్ రెడ్డి, రామ గౌడ్, మిట్ట వెంకట రంగారెడ్డి, బేగరి అనిల్, ఊరడి నర్సింలు, రమేష్, పృధ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.