21-02-2026 06:35:09 PM
* పేదోడి పెళ్లి కానుకపై రాజకీయం వద్దు
* ఆర్డీఓ
కందుకూరు,(విజయక్రాంతి): గత ఆరు నెలలుగా మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని నిరసిస్తూ కందుకూరులో బీఆర్ఎస్ నాయకులు భారీ ధర్నా చేపట్టారు. శనివారం మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మన్నె జయేందర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డికి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ జరిగితే తమకు ఎక్కడ గుర్తింపు రాదనే భయంతో కాంగ్రెస్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి పంపిణీని నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తులం బంగారం ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్, కనీసం గత ప్రభుత్వం మంజూరు చేసిన ₹1,11,116 చెక్కులను కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
రాజకీయ విబేధాలు ఉంటే పార్టీల మధ్య చూసుకోవాలి కానీ, పేద ప్రజలకు అందాల్సిన పథకాలను అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు.వారం రోజుల్లోగా అధికారులు స్పందించి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలి. లేనిపక్షంలో లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, మాజీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మినర్సింహ రెడ్డి, కాకి దశరథ, లెమూర్ సర్పంచ్ మేఘనాథ్ రెడ్డితో పాటు దామోదర్ గౌడ్, ప్రకాష్ రెడ్డి, శేఖర్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.