వొడాఫోన్ ఐడియాలో 2,458 కోట్ల వాటా
- నోకియా, ఎరిక్‌సన్‌లకు కేటాయింపు
న్యూఢిల్లీ, జూన్ 13: రుణభారం తో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా రూ.2,458 కోట్ల విలువైన వాటాల్ని నోకియా ఇండియా, ఎరిక్‌సన్ ఇండియాలకు కేటాయించను న్నది. తమకు నెట్‌వర్క్ ఎక్విప్‌మెంట్ సరఫరా చేసిన నోకియా, ఎరిక్‌సన్‌లకు చెల్లించాల్సిన బకాయిలకు బదులుగా ప్రిఫరెన్షియల్ ప్రాతిపాదికన షేర్లను కేటాయిస్తున్నట్టు వొడా ఫోన్ ఐడియా స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. కంపెనీ ఇటీవల జారీచేసిన ఫాలో ఆన్ ఆఫర్ ధరకంటే 35 శాతం అధిక ధరతో కేటాయిస్తున్న ఈ షేర్లకు 6 నెలల లాక్‌ఇన్ సమ యం ఉంటుందని వెల్లడించింది.
రూ.10 ముఖవిలువగలిగిన రూ. 2,458 కోట్ల విలువైన 166 కోట్ల ఈక్విటీ షేర్లను షేరుకు రూ.14.80 ధరతో నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్‌వర్క్స్ ఇండియా, ఎరిక్‌సన్ ఇండియాలకు ప్రిఫరెన్షియల్ కేటాయింపు జరపాలన్న ప్రతిపాదనను వోడాఫోన్ ఐడియా డైరెక్టర్ల బోర్డు గురువారం ఆమోదించింది. జూలై 10న జరిగే అత్యవసర సర్వసభ్య సమావేశం (ఈజీఎం) అనుమతికి లోబడి నోకియాకు రూ.1,520 కోట్ల విలువైన షేర్లు, ఎరిక్‌సన్‌కు రూ.938 కోట్ల షేర్లు కేటాయించనున్నట్టు వొడాఫోన్ ఐడియా వెల్లడించింది.






