22 June, 2026 | 5:48 PM

బ్లూచిప్స్‌లో కొనుగోళ్లు.. మార్కెట్ మరింత పైకి

15-06-2024 12:05 AM

సెన్సెక్స్, నిఫ్టీల రికార్డు ముగింపు

న్యూఢిల్లీ, జూన్ 14: ప్రోత్సాహకర ఎగుమతుల గణాంకాలు వెలువడిన నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర బ్లూచిప్ షేర్లలో కోనుగోళ్లు జరగడంతో వరుసగా మూడో రోజూ మార్కెట్ పరుగు కొనసాగింది. రెండు ప్రధాన స్టాక్ సూచీలు కొత్త రికార్డుస్థాయిల వద్ద ముగిసాయి. ఐటీ, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఇండస్ట్రియల్స్ షేర్లలో  భారీ కొనుగోళ్లు జరిగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 270 పాయింట్లు ఎగిసి  77,081 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది.

చివరకు 182 పాయింట్ల లాభంతో 76,993 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 91 పాయింట్లు ర్యాలీ జరిపి 23,490 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది.  చివరకు 67 పాయింట్ల లాభంతో 23,466 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ స్థాయిల్లో స్టాక్ సూచీలు ముగియడం ఇదే ప్రధమం. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 299 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 175 పాయింట్లు లాభపడింది. ఆసియాలో సియోల్, టోక్యో, షాంఘై మార్కెట్లు పెరగ్గా,హాంకాంగ్ సూచి తగ్గింది. యూరప్‌లోని కీలక మార్కెట్లయిన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌ల రెండో రోజూ భారీగా తగ్గాయి. బక్రీద్ సందర్భంగా జూన్ 17 సోమవారం మార్కెట్లకు సెలవు. 

మరో కొత్త రికార్డుకు మార్కెట్ విలువ

శుక్రవారం నాటి ర్యాలీతో స్టాక్ సూచీలతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్ విలువలో కూడా రూ.434.9 లక్షల కోట్లకు చేరి మరో సరికొత్త రికార్డుస్థాయిని నమోదు చేసింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.4,34,88,147 కోట్లకు (5.21 ట్రిలియన్ డాలర్లు) పెరిగింది.