చార్ సౌ కాదు.. గెలిస్తే చార్ సౌ బీస్
బీజేపీ గెలిస్తే పెట్రోల్ ౪౦౦
ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని!
కార్పొరేట్లకు పన్ను రద్దే బీజేపీ ఎజెండా
రాజన్నకు ప్రధాని మోదీ రూపాయి ఇవ్వలే
బండి మాట్లాడేది హిందో తెలుగో ఇంగ్లిషో!
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో అడ్డంగా మోసం
సిరిసిల్ల, సిద్దిపేట సభల్లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
రాజన్న సిరిసిల్ల/ సిద్దిపేట, మే 10 (విజయక్రాంతి): బీజేపీ కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను రూ.౪౦౦ చేస్తుందని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. వాళ్లు చెప్తున్న అబ్ కీ బార్ చార్ సౌ పార్ నినాదానికి అర్థం ఇదేనని విమర్శించారు. ప్రియమైన ప్రధాని కాదు.. ఆయన పిరమైన ప్రధాని అని అన్నారు. మోదీ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని, మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే చార్ సౌ కాదు.. చార్ సౌ బీస్ అని తేలిపోతుందన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ శుక్రవారం సిరిసిల్లతోపాటు సిద్దిపేట సభల్లో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ప్రధాని మోదీ వేములవాడకు వచ్చారు. ఆయన పక్కనే బండి సంజయ్ ఉన్నారు. దేశం కోసం ధర్మం కోసమనే మాట్లాడేవారు, దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగేవాళ్లు వేములవాడకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈయన అడగలేదు.. ఆయన ఇస్తామనలేదు.
ఇరుకుగా ఉంటే 35 ఎకరాల్లో మేమే గుడి చెరువు అభివృద్ధి చేశాం. గతంలో సిరిసిల్లలో అనేక చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగాయి. నేత కార్మికులకు రూ.370 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నది.. ఇవ్వమని అడిగితే కాంగ్రెస్ నాయకులు నిరోధ్‌లు, పాపడాలు అమ్ముకోవాలని అవమానించారు. కోపానికొచ్చి మాట్లాడితే నా మీద 48 గంటల నిషేధం పెట్టారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సబ్ కా వికాస్ ఏమైంది?
చేనేతపై జీఎస్టీ వేసిన మొదటి ప్రధాని మోదీ అని కేసీఆర్ విమర్శించారు. చేనేత ఇన్సూరెన్స్‌తోపాటు అనేక పథకాలను తొలగించారని ఆరోపించారు. ‘బీజేపీ ఎజెండాలో పేదవాళ్లు ఉండరు. పెద్దపెద్ద గద్దలు ఉంటారు. అంబానీ, అదానీలు, రూ.లక్షల కోట్ల శ్రీమంతులు ఉంటారు. వాళ్లకు కార్పొరేట్ ట్యాక్స్‌లు రద్దు చేస్తారు. పేదలకు ఏమీ చేయరు. మోదీ అధికారంలోకి వస్తే నల్లధనం తెచ్చి ప్రతి మనిషికి రూ.15 లక్షలు ఇస్తామన్నారు. ఎవరికైనా వచ్చాయా? రూ.15 కూడా రాలేదు. సబ్ కాసాత్.. సబ్ కా వికాస్ అంటే ఇదేనా? అమృత్‌కాల్, అచ్చేదిన్ వచ్చిందా? బేటీ పడావో బచావో అయ్యిందా? ఏమీ కాలే. అంతా వట్టిదే గ్యాస్.
డబ్బాలో రాళ్లు వేసి ఊపుడు తప్ప పేదలకు ఏమీ కాలేదు. ఉన్నవి తీసేశారు. గొల్ల కురుమలకు గొర్లు ఇస్తుంటే అడ్డం పడ్డారు. నరేంద్రమోదీ వచ్చి గోదావరి ఎత్తుకపోతామంటున్నారు. మోసపోతే గోస పడుతం. కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపెట్టింది. నోటికొచ్చిన హామీలిచ్చి గద్దెనెక్కి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఒక్క ఉచిత బస్సు పెట్టారు. బస్సులో ఆడవాళ్లు సర్కస్ చేసినట్లు తన్నుకుంటున్నారు. ఆటో కార్మికులు రోడ్డున పడి అన్నమో రామచంద్రా అంటున్నారు. రైతుబంధు రాలేదు. రుణమాఫీ కాలేదు.
నీళ్లుల రాలేదు. కరెంట్ రాలేదు. మర మగ్గాలు మూలన పడ్డాయి. చేనేత కార్మికులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. కార్మికులను, మహిళలను, రైతులను మోసం చేశారు. వాళ్లే మళ్లీ ఓట్లు అడుగుతున్నారు. బండి సంజయ్‌కి, వినోద్‌కుమార్‌కు ఏమైనా పోలిక ఉందా? బండి మాట్లాడేది ఏమీ ఆర్థం కాదు. అది హిందీయో, ఇంగ్లిషో, తెలుగో తెలియదు. వినోద్‌కుమార్ ఎంతో అనుభవమున్న వ్యక్తి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేవుడి పేరు పెట్టాం. ఇప్పుడు దాన్ని సీఎం రేవంత్ రద్దు చేస్తామంటున్నారు. జిల్లా ఉండాలంటే వినోద్‌కుమార్ గెలువాలి’ అని కేసీఆర్ అన్నారు.
సిద్దిపేట బీఆర్‌ఎస్ గడ్డ అని నిరూపించాలి
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కోడి తన పిల్లల్ని కాపాడినట్టు అన్నివర్గాల ప్రజలను అదుకున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బడుగు బలహీనవర్గాలకు ఉన్న పథకాలన్నింటినీ నిలిపేసిందని కేసీఆర్ విమర్శించారు. సిద్దిపేట సభలో ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసిన సిద్దిపేట గడ్డ బీఆర్‌ఎస్‌కు అండగా ఉంటుందని అన్నారు. ‘నేను ఏ రోజు వచ్చినా మీ కన్న బిడ్డలాగ ఆదరించారు. అదే ప్రేమతో హరీశ్‌రావును అదరించారు. ఇప్పుడు మన జిల్లాకు అధికారిగా సేవ చేసిన మాజీ కలెక్టర్ వెంకట్‌రామ్‌రెడ్డిని గెలిపించాలి.
సిద్దిపేట జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉన్న మొక్కలు వెంకట్‌రామ్‌రెడ్డి నాటినవే. ఆయనను లక్ష మెజార్టీతో గెలిపించండి. రాష్ట్రం కోసం, దేశం కోసం బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలి’ అని కోరారు. మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రదాత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్‌రామ్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, నాయకులు ఫరూఖ్ హుసేన్, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






