30 April, 2026 | 2:25 PM

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

30-04-2026 01:11 PM

ధర్మపురి,ఏప్రిల్ 30(విజయక్రాంతి): ఎండపల్లి మండలంలోని గొడిషెలపేట గ్రామంలో గురువారం "రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమాన్ని మండల వ్యవసాయాధికారి మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పొలాస పరిశోధన స్థానం శాస్త్రవేత్త  డాక్టర్ స్పందన బట్ మాట్లాడుతూ తక్కువ యూరియా వాడకం, పంటల మార్పిడి, ప్రకృతి వ్యవసాయం, పచ్చిరొట్ట పంటల సాగు,  నేల ఆరోగ్యం,అలాగే వరి పంట  కోసిన తర్వాత  పంట అవశేషాలు కాల్చకుండా నేలలో కలియదున్నటం వంటి వివిధ అంశాల పై రైతులకు అవగాహన కల్పించారు.

శాస్త్రవేత్త డాక్టర్ సుమలత మాట్లాడుతూ వివిద పంటలలో చీడపీడల నివారణ మరియు రసాయన మందులు ఎలా వాడాలో తెలియచేశారు. మండల వ్యవసాయధికారి కె.మహేష్  మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్న వరి  రకాల అయిన బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, జేజిఎల్ 1798, జై శ్రీరామ్, హెచ్ఎమ్ టీ  వంగడాలను సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి అర్చన, వ్యవసాయ విస్తరణ అధికారి బి.సందీప్,ఉద్యానవన విస్తరణ అధికారి వంశీ, అభిగ్న, గోడిషెలపేట గ్రామ సర్పంచ్ కందికట్ల అమృత రాజేశం,శానబండ సర్పంచ్, గాధం భాస్కర్, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.